Monday 22 October 2012

Sivanandalahari-40

ధీయన్త్రేణ వచోఘటేన కవితా కుల్యోపకుల్యాక్రమై
రానీతైశ్చ సదాశివస్య చరితామ్భోరాశి దివ్యామృతైః
హృత్కేదారయుతాశ్చ భక్తికలమాః సాఫల్యమాతన్వతే
దుర్భిక్షాన్మమ సేవకస్య భగవన్ విశ్వేశ భీతిః కుతః (40)

ధీ యన్త్రేణ = బుద్ధి అనెడి యంత్రముతో
వచో ఘటేన = వాక్కు అనెడి కుండలతో
కవితా = కవిత్వము అనెడి
కుల్యోపకుల్యాక్రమైః = కాలువలు పిల్లకాలువలద్వారా
ఆనీతైః చ = తీసుకురాబడిన
సదాశివస్య = సదాశివునియొక్క
చరిత = చరితము అనెడి
అమ్భో రాశి దివ్య అమృతైః = దివ్యామృత జల రాశులు
హృత్కేదార = హృదయము అనెడి పంటభూమితో
యుతాః చ = కలిసినప్పుడు
భక్తి కలమాః = భక్తి అనెడి పంట
సాఫల్యమ్ ఆతన్వతే = సాఫల్యమును పొందుతుంది
దుర్భిక్షాత్ = దుర్భిక్షమువలన
మమ = నాకు
సేవకస్య = (నీ) సేవకునకు
భగవన్ = హే భగవాన్
విశ్వేశ = హే జగత్ప్రభో
భీతిః కుతః = భయము ఎక్కడ ఉన్నది?

బుద్ధి అనెడి యంత్రముతో, వాక్కు అనెడి కుండలతో, కవిత్వము అనెడి కాలువలు పిల్లకాలువలద్వారా తీసుకురాబడిన సదాశివునియొక్క చరితము అనెడి దివ్యామృత జల రాశులు, హృదయము అనెడి పంటభూమితో కలిసినప్పుడు, హృదయమునందలి భక్తి అనెడి పంట సాఫల్యమును పొందుతుంది. హే భగవాన్, హే జగత్ప్రభో, నీ సేవకుడనగు నాకు ఇక దుర్భిక్షమువలన భయము ఎక్కడ ఉన్నది?

కొన్ని వివరణలు:

(1) పంట పొలాలకు నీరు పెట్టడానికి ఉపయోగించే ఒక విధానములో, ఒక యంత్రానికి బానను (బకెట్) ఒకదానిని అమరుస్తారు. ఆ యంత్రాన్ని త్రిప్పినప్పుడు, పెద్దకాలువలలోనుండి నీరు, ఈ బానద్వారా చేనుకు దగ్గరగా తీసుకుని రాబడుతుంది. దీనిని "ఏతము" అని అంటారు. ఆక్కడినుండి ఆ నీరు పిల్లకాలువలద్వారా పంట పొలాలలోకి మళ్ళింపబడుతుంది. దీనిని ఉపమానముగా తీసుకుని, భక్తుని హృదయము అనే పంటభూమిలోనికి భగవంతుని చరితామృతము అనెడి దివ్య జలాలను ఎలా తీసుకు రావాలో, అలా తీసుకు రాబడిన జలాలు ఆ భూమిలోని భక్తి అనెడి పంటతో కలిసినపుడు ఏమి జరుగుతుందో ఈ శ్లోకములో హృద్యముగా వివరించారు.

Saturday 20 October 2012

Sivanandalahari-39

ధర్మో మే చతురంఘ్రికస్సుచరితః పాపం వినాశం గతం
కామ క్రోధ మదాదయో విగలితాః కాలాః సుఖావిష్కృతాః
జ్ఞానానన్ద మహౌషధిః సుఫలితా కైవల్యనాథే సదా
మాన్యే మానసపుణ్డరీక నగరే రాజావతంసే స్థితే (39)

ధర్మః మే = నేను ఆచరించు ధర్మము
చతురంఘ్రికః = నాలుగు పాదములమీద (1.సత్యము, 2.దానము, 3.తపస్సు, 4.దయ)
సు చరితః = చక్కగా నడుస్తుంది
పాపం వినాశం గతం = పూర్వ పాపములన్నీ నశిస్తాయి
కామ క్రోధ మదాదయః  = కామ క్రోధాది అరిషడ్వర్గములు
విగలితాః = అంతమొందుతాయి
కాలాః = సర్వ కాలములు
సుఖ ఆవిష్కృతాః = సుఖమును కలుగజేస్తాయి
జ్ఞానానన్ద మహౌషధిః  = జ్ఞానము, ఆనందము అనెడి దివ్యౌషధములు
సుఫలితా = సత్ఫలితములను ఇస్తాయి
కైవల్యనాథే = కైవల్యనాథుడగు పరమశివుడు
సదా =ఎల్లప్పుడూ
మాన్యే = పూజింపబడుతూ
మానస పుణ్డరీక నగరే = హృదయ కమలమనెడి నగరమునందు
రాజ అవతంసే = రాజులందరిలోకి కలికితురాయి
స్థితే = నివశించుచున్నప్పుడు

రాజులందరిలోకి కలికితురాయి, కైవల్యనాథుడు అయిన పరమశివుడు, నాచే ఎల్లప్పుడూ పూజింపబడుతూ, నా హృదయ కమలమనెడి నగరమునందు నివశించుచున్నప్పుడు, నేను ఆచరించు ధర్మము నాలుగు పాదములమీద చక్కగా నడుస్తుంది. పూర్వ పాపములన్నీ నశిస్తాయి. కామ క్రోధాది అరిషడ్వర్గములన్నీ అంతమొందుతాయి. సర్వ కాలములు సుఖమును కలుగజేస్తాయి. జ్ఞానము, ఆనందము అనెడి దివ్యౌషధములు సత్ఫలితములను ఇస్తాయి.

Friday 19 October 2012

Sivanandalahari-38

ప్రాక్పుణ్యాచల మార్గదర్శిత సుధామూర్తిః ప్రసన్నశ్శివః
సోమస్సద్గుణ సేవితో మృగధరః పూర్ణస్తమో మోచకః
చేతః పుష్కర లక్షితో భవతి చేదానన్దపాథో నిధిః
ప్రాగల్భ్యేన విజృంభతే సుమనసాం వృత్తిస్తదా జాయతే (38)

ప్రాక్ పుణ్య అచల = పూర్వ పుణ్యము అనెడి రాశి (వలన)
మార్గ దర్శిత = చూడబడువాడు
సుధా మూర్తిః = మూర్తీభవించిన అమృతత్వము
ప్రసన్న = ప్రసన్నుడు
శివః  = పరమశివుడు
సోమః = ఉమాసమేతుడు (స + ఉమః)
సద్గుణ సేవితః = సద్గుణ సేవితుడు
మృగధరః = లేడిని చేత ధరించినవాడు (మాయకు చిహ్నము)
పూర్ణః = పూర్ణుడు
తమో మోచకః = అజ్ఞానమునుండి విమోచనము కలిగించువాడు
చేతః పుష్కరః = మనో మండలములో
లక్షితో భవతి చేత్ = చూడబడినచో
ఆనన్ద పాథో నిధిః = ఆనందమనే సాగరము
ప్రాగల్భ్యేన విజృంభతే = ఉప్పొంగి పొరలుతుంది
సుమనసాం = మంచి మనస్సు కలవారి
వృత్తిః తదా = (మనో) వృత్తులు అప్పుడు
జాయతే = (ఆ ఆనంద సాగరమునందే) లీనమవుతాయి

పురాకృత పుణ్యరాశి ఫలితముగా చూడబడువాడు, అమృత మూర్తి, ప్రసన్నుడు, ఉమాసమేతుడు, సద్గుణ సేవితుడు, మృగధరుడు, పూర్ణుడు, అజ్ఞానమును నశింపజేయువాడగు ఆ పరమశివుని మన మనో మండలమునందు దర్శించినట్లయితే, మనలో ఆనంద సాగరము ఉప్పొంగి పొరలుతుంది. అప్పుడు, మంచి మనస్సు కలవారి మనోవృత్తులన్నీ ఆ ఆనంద సాగరమునందే లీనమవుతాయి.

ఈ శ్లోకమునకు రెండు అర్ధములు కలవు. మొదటి అర్ధం మనం పైన వివరించుకున్నట్లు పరమేశ్వరుని పరంగా కలదు. ఇక రెండవ అర్ధం - ఇదే శ్లోకం యధాతథంగా చంద్రునికి కూడా అన్వయమవుతుంది. ఎలాగో ఇప్పుడు చూద్దాము:

ప్రాక్ పుణ్య అచల = తూర్పున ఉన్న పవిత్రమైన ఉదయగిరిన
మార్గ దర్శిత = చూడబడువాడు
సుధా మూర్తిః = తెల్లని రూపము కలిగినవాడు
ప్రసన్న = అహ్లాదమును కలిగించువాడు
శివః  = మంగళకరుడు
సోమః = చంద్రుడు
సద్గుణ సేవితః = నక్షత్రముల మధ్యన ఉన్నవాడు
మృగధరః = లేడిని పోలిన రూపమును (మచ్చను) ధరించినవాడు
పూర్ణః = పూర్ణుడు (16 కళలు కలవాడు)
తమో మోచకః = చీకటిని తొలగించువాడు
చేతః పుష్కరః = మనో మండలము
లక్షితో భవతి చేత్ = చూడబడినచో
ఆనన్ద = ఆనందముతో
పాథో నిధిః = సాగర జలములు
ప్రాగల్భ్యేన విజృంభతే =  ఉప్పొంగి పొరలుతాయి
సుమనసాం = సువాసనలను వెదజల్లు పుష్పములు
వృత్తిః తదా జాయతే = అప్పుడు చక్కగా వికసిస్తాయి

తూర్పున ఉన్న పవిత్రమైన ఉదయగిరిన చూడబడువాడు, తెల్లని రూపము కలిగినవాడు, అహ్లాదమును కలిగించువాడు, మంగళకరుడు, నక్షత్రముల మధ్యన ఉన్నవాడు, లేడి రూపమును ధరించినవాడు, షోడశ కళా పూర్ణుడు, చీకటిని తొలగించువాడగు చంద్రుని దర్శించినప్పుడు, సాగర జలములు ఆనందముతో ఉప్పొంగి పొరలుతాయి. సువాసనలను వెదజల్లు పుష్పములు చక్కగా వికసిస్తాయి.

Tuesday 16 October 2012

Sivanandalahari-37

ఆమ్నాయాంబుధిమాదరేణ సుమనస్సంఘాస్సముద్యన్మనో
మన్థానం దృఢభక్తి రజ్జు సహితం కృత్వా మథిత్వా తతః
సోమం కల్పతరుం సుపర్వ సురభిం చిన్తామణిం ధీమతాం
నిత్యానన్ద సుధాం నిరన్తరరమా సౌభాగ్యమాతన్వతే (37)

ఆమ్నాయ అంబుధిం = వేదములు అనే సముద్రమును
ఆదరేణ = ఆదరముతో
సుమనః సంఘః = సత్పురుషుల సమూహము
సముద్యన్ మనః = శ్రద్దకలిగిన మనస్సును
మన్థానం = కవ్వముగా
దృఢ భక్తి = దృఢ భక్తిని
రజ్జు సహితం = త్రాడుగా
కృత్వా = చేసుకుని
మథిత్వా తతః = మథనము చేయగా, అప్పుడు
సోమం = ఉమాసమేతుడు
కల్పతరుం = కల్పవృక్షము
సుపర్వ సురభిం = కామధేనువు
చిన్తామణిం = చింతామణి
ధీమతాం = ధీమంతులు
నిత్యానన్ద సుధాం = నిత్యానందము అనే అమృతమును
నిరన్తర రమా = నిరంతర ఐశ్వర్యమును (ముక్తి)
సౌభాగ్యం = సౌభాగ్యము
ఆతన్వతే = పొందెదరు

సత్పురుషుల సమూహము, శ్రద్దకలిగిన మనస్సును కవ్వముగా చేసుకుని, దృఢ భక్తిని త్రాడుగా చేసుకుని, వేదములు అనే సముద్రమును ఆదరముతో మథనము చేయగా, అప్పుడు ఆ ధీమంతులు, ఉమాసమేతుడగు పరమేశ్వరుడిని, కల్పవృక్షము, కామధేనువు, చింతామణులవలె కోర్కెలను ఈడేర్చువానిని, నిత్యానందము అనే అమృతమును, నిరంతర ఐశ్వర్య దాయకమైన ముక్తిని, సౌభాగ్యములను పొందెదరు.

కొన్ని వివరణలు:

(1) దేవతలు మందరగిరి పర్వతాన్ని కవ్వముగా చేసుకుని, వాసుకిని త్రాడుగా చేసుకుని పాల-సముద్రమును చిలికితే, అప్పుడు వారికి, చంద్రుడు, కామధేనువు, కల్పవృక్షము, చింతామణి, హాలాహలము, అమృతము ఇత్యాది వస్తువులు లభించాయి. అలానే, ధీమంతులు 'శ్రద్ధ కలిగిన మనస్సు'ను కవ్వముగా చేసుకుని, 'దృఢ భక్తి'ని త్రాడుగా చేసుకుని వేద-సముద్రమును చిలికితే ఏమి లభిస్తాయో ఈ శ్లోకములో శంకరాచార్యులవారు తెలియజేస్తున్నారు.

(2) శంకరాచార్యులవారు ఈ శ్లోకములో పదాలను చాలా గమ్మత్తుగా ప్రయోగించారు. ఉదాహరణకు, "సోమః" అన్న పదానికి "చంద్రుడు" అనే అర్ధముతోపాటు, "పార్వతీ సమేతుడైన పరమేశ్వరుడు" (స+ఉమః=సోమః) అని మరొక అర్ధముకూడా కలదు. పాల-సముద్రాన్ని చిలికినప్పుడు సోముడు లభిస్తే, వేద-సముద్రాన్ని చిలికినవారికి సాక్షాత్తు ఉమాసమేతుడైన పరమేశ్వరుడే లభించగలడు అని చెబుతున్నారు.

Sunday 14 October 2012

Sivanandalahari-36

భక్తో భక్తిగుణావృతే ముదమృతాపూర్ణే ప్రసన్నే మనః
కుంభే సాంబ తవాంఘ్రిపల్లవయుగం సంస్థాప్య సంవిత్ ఫలమ్
సత్వం మన్త్రముదీరయన్నిజ శరీరాగార శుధ్దిం వహన్
పుణ్యాహం ప్రకటీ కరోమి రుచిరం కల్యాణమాపాదయన్ (36)

భక్తః = భక్తుడు
భక్తి గుణ ఆవృతే = భక్తి అనెడి సూత్రముచే (దారముచే) ఆవృతమై (కప్పబడి)
ముద అమృత ఆపూర్ణే  = సంతోషము అనెడి అమృత జలములతో నింపబడిన
ప్రసన్నే = నిర్మలమైన
మనః కుంభే = మనస్సు అనెడి కలశమునందు
సాంబ = ఓ సాంబశివా, జగన్మాతతో కూడియున్నవాడా
తవ అంఘ్రి పల్లవ యుగం = నీ పాదములు అనెడి (మామిడి) చిగుళ్ళను
సంస్థాప్య = ఉంచి
సంవిత్ ఫలమ్ = జ్ఞానము అనెడి ఫలమును (కొబ్బరికాయను)
సత్వం మన్త్రం = సత్వమును కలిగించెడు నీ మంత్రమను (ఓం నమః శివాయ)
ఉదీరయన్ = ఉచ్చరించుచు
నిజ శరీర ఆగార = నా శరీరము అనెడి గృహమును
శుధ్దిం వహన్ = శుద్ధి చేసుకొనుటకై
పుణ్యాహం = పుణ్యాహము
ప్రకటీ కరోమి = చేయుచున్నాను
రుచిరం కల్యాణం = విశేషమైన మంగళములను
ఆపాదయన్ = పొందగోరి

ఓ సాంబశివా, నీ భక్తుడనైన నేను విశేషమైన మంగళములను పొందగోరి, నా శరీరము అనెడి గృహమును శుద్ధి చేసుకొనుటకై, భక్తి అనెడి సూత్రముచే ఆవృతమై, సంతోషము అనెడి అమృత జలములతో నింపబడిన నిర్మలమైన నా మనస్సు అనెడి కలశమునందు, నీ పాదములు అనెడి మామిడి చిగుళ్ళను, మరియు జ్ఞానము అనెడి నారికేళ ఫలమును ఉంచి, సత్వమును కలిగించెడు 'ఓం నమః శివాయ' అను మంత్రమను ఉచ్చరించుచు పుణ్యాహము చేయుచున్నాను.

కొన్ని వివరణలు:

(1) వివాహము, గృహప్రవేశము మొదలగు శుభకార్యములు చేసుకునేటప్పుడు, లేదా అమంగళములవలన మైల పడినవాటిని శుద్ధి చేసుకునేందుకు "పుణ్యాహము" అనెడి వైదిక విధిని ఆచరిస్తారు. అందులో భాగంగా, పై చిత్రములో చూపిన విధముగా, ఒక కలశ చుట్టూ పసుపు వ్రాసిన దారమును చుట్టి, ఆ కలశలో నీరుపోసి, అందులో మామిడి చిగుళ్ళను పెట్టి, ఆ పైన ఒక కొబ్బరికాయను ఉంచుతారు. అయితే ఈ శ్లోకమునందు, మన శరీరము అనెడి గృహమును శుద్ధి చేసుకోవడంకోసం ఆచరించవలసిన పుణ్యాహమునకు కావలసిన సామగ్రిగూర్చి వివరిస్తున్నారు.

Saturday 13 October 2012

Sivanandalahari-35

యోగక్షేమ ధురంధరస్య సకలః శ్రేయః ప్రదోద్యోగినో
దృష్టాదృష్ట మతోపదేశ కృతినో బాహ్యాన్తర వ్యాపినః
సర్వజ్ఞస్య దయాకరస్య భవతః కిం వేదితవ్యం మయా
శంభో త్వం పరమాన్తరంగ ఇతి మేచిత్తే స్మరామ్యన్వహమ్ (35)

యోగ క్షేమః = యోగ క్షేమములు
ధురంధరస్య = కేవల బాధ్యతగా కలిగియున్నవాడవు
సకల శ్రేయః = సకల శ్రేయస్సులను
ప్రదోద్యోగినః = ప్రదానము చేయుటయే ఉద్యోగముగా కలవాడవు
దృష్ట అదృష్ట మత = ఇహ పర సాధనలకు ఆవశ్యకమైన జ్ఞానమును
ఉపదేశ కృతినః = ఉపదేశించుటలో నిష్ణాతుడవు
బాహ్యాన్తర వ్యాపినః = బాహ్యాంతరములయందు వ్యాపించినవాడవు
సర్వజ్ఞస్య = సర్వజ్ఞుడవు
దయాకరస్య = దయాకరుడవు
భవతః = (అయిన) నీకు
కిం వేదితవ్యం = ఏమి విన్నవించుకోవలసి యున్నది?
మయా = నాచేత
శంభో = ఓ శంభో,
పరమ అన్తరంగ = (నీవు నాకు) అత్యంత ఆంతరంగికుడవు
ఇతి మే చిత్తే  = అని నా మనస్సులో
స్మరామి = స్మరించుకొనుచున్నాను
అన్వహమ్ = ప్రతి రోజు

ఓ ఈశ్వరా, మా యోగ క్షేమములను చూసుకోవడమే నీ కేవల బాధ్యతగా కలిగియున్నవాడవు, మాకు సకల శ్రేయస్సులను ప్రదానము చేయుటయే ఉద్యోగముగా కలవాడవు, ఇహ పర సాధనలకు ఆవశ్యకమైన జ్ఞానమును ఉపదేశించుటలో నిష్ణాతుడవు, మా బాహ్యాంతరములయందు వ్యాపించినవాడవు, సర్వజ్ఞుడవు, దయాకరుడవు అయిన నీకు నేను ఏమి విన్నవించుకోవలసి యున్నది? ఓ శంభో, నీవు నాకు అత్యంత ఆంతరంగికుడవన్న సత్యమును ప్రతి రోజు నా మనస్సులో స్మరించుకొనుచున్నాను.

Friday 12 October 2012

Sivanandalahari-34

కిం బ్రూమస్తవ సాహసం పశుపతే కస్యాస్తి శంభో భవ
ధ్దైర్యం చేదృశమాత్మనః స్థితిరియం చాన్యైః కథం లభ్యతే
భ్రశ్యద్దేవగణం త్రసన్మునిగణం నశ్యత్ ప్రపంచం లయం
పశ్యన్నిర్భయ ఏక ఏవ విహరత్యానన్ద సాన్ద్రో భవాన్ (34)

కిం బ్రూమః = ఏమని చెప్పగలము?
తవ సాహసం = నీ సాహసమునుగూర్చి
పశుపతే = ఓ పశుపతీ
కస్య అస్తి = ఎవరికి ఉన్నది?
శంభో = ఓ శంభో, ఆనందప్రదాయకా
భవద్ ధైర్యం = నీ ధైర్యము
చ ఈదృశం = మరియు అట్టి
ఆత్మనః స్థితిః = ఆత్మ స్థితి
ఇయం చ = ఇది మరి
అన్యైః కథం లభ్యతే = తక్కినవారు ఎలా పొందగలరు?
భ్రశ్యద్ దేవ గణం = దేవ గణములు పారిపోయినవి
త్రసన్ ముని గణం = ముని గణములు వణికిపోయినవి
నశ్యత్ ప్రపంచం లయం = ప్రపంచం నశించి లయమైపోవడం
పశ్యన్ = చూచి
నిర్భయ ఏక ఏవ = నిర్భయముగా ఒక్కడివే
విహరతి = విహరిస్తూ ఉన్నావు
ఆనన్ద సాన్ద్రః = మహదానందములో
భవాన్ = నీవు

ఓ పశుపతీ, నీ సాహసమునుగూర్చి ఏమని చెప్పగలము? ఓ శంభో, నీ ధైర్యము మరియు అట్టి ఆత్మ స్థితి మరి తక్కినవారు ఎలా పొందగలరు? ప్రపంచమంతా ప్రళయమునందు నశించి లయమైపోవడం చూచి, దేవగణములు పారిపోయినవి, మునిగణములు వణికిపోయినవి. నీవుమాత్రం నిర్భయముగా ఒక్కడివే మహదానందములో విహరిస్తూ ఉన్నావు.

కొన్ని వివరణలు:

(1) కేవలము ఈశ్వరుని గొప్పతనాన్ని స్తుతి చేయడమే ఈ శ్లోకముయొక్క లక్ష్యము కాదు. ఇంతకు ముందు శంకరాచార్యులవారు (28వ శ్లోకములో) వివరించినట్లు, మనము ఎంతగా శివుని తత్వాన్నిగూర్చి చింతన చేస్తే, మనలోనూ అంతగా ఈశ్వరుని గుణములే వికసిస్తాయి. ఈ శ్లోకములో తెలిపినట్టి ఈశ్వరుని ఆత్మ స్థితిగూర్చి ధ్యానించుటద్వారా, మనముకూడా పరిస్థితులపైన ఆధారపడని అట్టి నిశ్చలమైన, భయరహితమైన స్థితిని ఈశ్వరానుగ్రహముతో కొంతవరకైనా పొందగలమని చెప్పడం శంకరాచార్యులవారి ఆంతర్యమేమో!

Thursday 11 October 2012

Sivanandalahari-33

నాలం వా సకృదేవ దేవ భవతస్సేవా నతిర్వా నుతిః
పూజా వా స్మరణం కథాశ్రవణమప్యాలోకనం మాదృశామ్
స్వామిన్నస్థిర దేవతానుసరణాయాసేన కిం లభ్యతే
కా వా ముక్తిరితః కుతో భవతి చేత్ కిం ప్రార్థనీయం తదా (33)

న అలం వా = చాలదా?
సకృద్ ఏవ = కేవలము ఒక్కసారి
దేవ = ఓ దేవా
భవతః సేవా = నీ సేవ
నతిః వా నుతిః = సాష్టాంగ ప్రణామము మరియు స్తుతి
పూజా వా = ఆరాధనము మరియు
స్మరణం= స్మరణము
కథా శ్రవణం = కథా శ్రవణము
అపి ఆలోకనం = మరియు ఆలోకనము (= నిశితముగా చూచుట)
మాదృశామ్ = నాలాంటి వాడికి
స్వామిన్ = ఓ స్వామీ
అస్థిర దేవతా = అస్థిరమైన దేవతలను
అనుసరణ ఆయాసేన = అనుసరించుటచే కలుగు ఆయాసమువలన
కిం లభ్యతే = ఏమి లభించును?
కా వా ముక్తిః = ముక్తి అంటే ఏమిటి?
ఇతః కుతో భవతి చేత్ = అది ఇక్కడ కాకుంటే మరి ఇంకెక్కడ ఉన్నది?
కిం ప్రార్థనీయం తదా = అటువంటప్పుడు దేనిని గూర్చి ప్రార్ధించాలి?

ఓ దేవా, ఒక్కసారైనా నీ సేవ, నీకు సాష్టాంగ ప్రణామము మరియు స్తోత్రము చేయడము, నీ ఆరాధనము మరియు స్మరణము, నీ కథా శ్రవణము మరియు ఆలోకనములను చేసినా, నాలాంటి వాడికి చాలదా? ఓ స్వామీ, అస్థిరమైన దేవతలను అనుసరించుటచే కలుగు ఆయాసమువలన ఏమి ప్రయోజనము కలదు? ముక్తి అంటే ఏమిటి? అది ఇక్కడ కాకుంటే మరి ఇంకెక్కడ ఉన్నది? అటువంటప్పుడు ఇక దేనిని గూర్చి ప్రార్ధించాలి?

Wednesday 10 October 2012

Sivanandalahari-32

జ్వాలోగ్రస్సకలామరాతి భయదః క్ష్వేలః కథం వా త్వయా
దృష్టః కించ కరే ధృతః కరతలే కిం పక్వ జమ్బూఫలమ్
జిహ్వాయాం నిహితశ్చ సిధ్దగుటికా వా కణ్ఠదేశే భృతః
కిం తే నీలమణిర్విభూషణమయం శంభో మహాత్మన్ వద (32)

జ్వాలోగ్రః = ఉగ్ర జ్వాలలతో
సకల అమర = దేవతలందరకీ
అతి భయదః క్ష్వేలః = తీవ్ర భయమును కలిగించిన గరళము
కథం వా = ఎలా
త్వయా దృష్టః = నీచే చూడబడినది?
కిం చ = అంతేగాక
కరే ధృతః = (ఎలా) చేతితో పట్టుకున్నావు?
కర తలే = అరచేతిలో (పెట్టుకోవడానికి)
కిం పక్వ జమ్బూ ఫలమ్ = అదేమైనా అరముగ్గిన నేరేడుపండా?
జిహ్వాయాం నిహితః చ = మరియు నాలుకపై ఉంచుకొనబడినది
సిధ్ద గుటికా వా = అదేమైనా వైద్యుడిచ్చిన ఔషధ గుళికా?
కణ్ఠ దేశే భృతః = కంఠమునందు నిలిపివేసావు
కిం తే = అదేమైనా నీ
నీల మణి విభూషణం = నీలమణి పొదిగిన కంఠాభరణమా?
అయం = దీనిని గురించి
శంభో = ఓ శంభో, ఆనంద ప్రదాయకా
మహాత్మన్ = ఓ మహాత్మా
వద = చెప్పుము

ఓ శంభో, ఓ మహాత్మా, నీవు ఈ సంగతి చెప్పవయ్యా. ఉగ్ర జ్వాలలతో దేవతలందరకీ తీవ్ర భయమును కలిగించిన ఆ గరళమును అసలు నీవు ఎలా చూడగలిగావు? చూడడమేగాక, దానిని చేతితో ఎలా పట్టుకున్నావు? అలా అరచేతిలో పెట్టుకోవడానికి అదేమైనా అరముగ్గిన నేరేడుపండా? నాలుకపై ఉంచుకోవడానికి అదేమైనా వైద్యుడిచ్చిన ఔషధ గుళికా? పైగా కంఠమునందు నిలిపివేయడానికి అదేమైనా నీలమణి పొదిగిన కంఠాభరణమా?

Tuesday 9 October 2012

Sivanandalahari-31

నాలం వా పరమోపకారకమిదం త్వేకం పశూనాం పతే
పశ్యన్ కుక్షిగతాన్ చరాచరగణాన్ బాహ్యస్థితాన్ రక్షితుమ్
సర్వామృత్య పలాయనౌషధమతి జ్వాలాకరం భీకరం
నిక్షిప్తం గరలం గలే న గిలితం నోద్గీర్ణమేవ త్వయా (31)

న అలం వా = చాలదా?
పరమోపకారకం = మహోపకారం
ఇదం తు ఏకం = ఈ ఒక్కటే
పశూనాం పతే = ఓ పశుపతీ
పశ్యన్ = చూసి
కుక్షి గతాన్ = ఉదరములో ఉన్న
చర అచర గణాన్ = చరాచర గణములను
బాహ్యస్థితాన్ = (మరియు) బాహ్యమున ఉన్నవాటిని
రక్షితుం = రక్షించడం కోసమని
సర్వ అమృత్య = అమరులు (దేవతలు) అందరినీ
పలాయన ఔషధం = పరుగెత్తించిన ఔషధము
అతి జ్వాలాకరం = ఉగ్ర జ్వాలలు కలిగినది
భీకరం = భీకరమైనది అయిన
నిక్షిప్తం గరలం = గరళమును ఉంచి
గలే = గళమునందు
న గిలితం = మ్రింగకుండా
న ఉద్గీర్ణం ఏవ = క్రక్కకుండా
త్వయా = నీచేత

ఓ పశుపతీ, (నీ కారుణ్యముగూర్చి చెప్పడానికి) నీవు చేసిన ఈ మహోపకారం ఒక్కటే చాలదా? నీ ఉదరము లోపల మరియు బయట ఉన్న చరాచర గణములను చూసి, వాటిని రక్షించడం కోసమని, దేవతలందరినీ పరుగెత్తించిన ఔషధము, ఉగ్ర జ్వాలలు కలిగినది, భీకరమైనది అయినట్టి గరళమును లోపలకు మ్రింగక, బయటకు క్రక్కక, నీవు నీ గళమునందే ఉంచుకున్నావు.

కొన్ని వివరణలు:

(1) ఈశ్వరుని సచ్చరిత్రము అనెడి అమృత ప్రవాహమునందు "హాలాహల భక్షణము" ఒక ప్రధానమైన ఘట్టము. ఎందుచేతనంటే, జగత్పిత, జగత్పతి అయిన పరమేశ్వరునికి జీవకోటిపైగల అవ్యాజమైన అపార కారుణ్యమునకు నిలువుటద్దం పట్టే అపూర్వ సంఘటన ఇది. అందరినీ సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తే ఈ అద్భుత లీలనుగూర్చి, శ్రీ శంకరభగవత్పాదులవారు ఈ (31వ) శ్లోకములోనూ, మరియు రాబోయే (32వ) శ్లోకములోనూ తమదైన శైలిలో కీర్తించారు.

Monday 8 October 2012

Sivanandalahari-30

వస్త్రోధ్దూతవిధౌ సహస్రకరతా పుష్పార్చనే విష్ణుతా
గన్ధే గన్ధవహాత్మతాஉన్నపచనే బర్హిర్ముఖాధ్యక్షతా
పాత్రే కాంచనగర్భతాస్తి మయి చేద్బాలేన్దు చూడామణే
శుశ్రూషాం కరవాణి తే పశుపతే స్వామిన్ త్రిలోకీ గురో (30)

వస్త్ర ఉధ్దూత విధౌ = వస్త్రయుగ్మం సమర్పించుటకు
సహస్ర కరతా = సహస్ర కరములు కలవాడు (సూర్యుడు)
పుష్పార్చనే  = పుష్పములతో అర్చించుటకు
విష్ణుతా = సర్వవ్యాపి అయిన విష్ణువును
గన్ధే గన్ధ వహాత్మతా = గంధము సమర్పించుటకు, వాసనలకు వాహకుడు (వాయువు)
అన్న పచనే = పచనముచేసిన అన్నమును సమర్పించుటకు
బర్హి ముఖ అధ్యక్షతా = అగ్నికి ప్రభువైనవాడు (ఇంద్రుడు)
పాత్రే కాఞ్చన గర్భతా = పూజించుటకై పాత్రలను సృజించుటకు, బ్రహ్మను
అస్తి మయి చేత్ = నేను అయి ఉంటే (మాత్రమే)
బాలేన్దు చూడామణే = ఓ బాలేన్దు శేఖరా
శుశ్రూషాం కరవాణి తే = నీ శుశ్రూష చేయగలను
పశుపతే = ఓ పశుపతీ
స్వామిన్ = ఓ స్వామీ
త్రిలోకీ గురో = ఓ త్రైలోక్యగురూ

బాలేన్దు శేఖరా, ఓ పశుపతీ, ఓ స్వామీ, ఓ త్రైలోక్యగురూ, నేను సహస్ర కరములు కలిగిన సూర్యుడను అయివుంటేనే నీకు వస్త్రయుగ్మమును, సర్వవ్యాపి అయిన విష్ణువును అయివుంటేనే పుష్పములను, వాయువును అయివుంటేనే గంధమును, అగ్నికి ప్రభువైన ఇంద్రుడను అయివుంటేనే పచనముచేసిన అన్నమును సమర్పించి, బ్రహ్మను అయివుంటేనే నిన్ను పూజించుటకై పాత్రలను సృజించి, అప్పుడు మాత్రమే నీ శుశ్రూష చేయగలను.

కొన్ని వివరణలు:

(1) "కరములు" అనగా "కిరణములు" అనికూడా అర్ధము ఉన్నది. సహస్ర (అసంఖ్యాక) కరములు గలవాడు సూర్య భగవానుడు.

(2) ఒకానొకప్పుడు శ్రీమహావిష్ణువు పరమశివుని సహస్ర కమలములతో అర్చింపదలచి, పూజ చేయుచున్నప్పుడు, పూజ చివరిలో ఒక కమలము తక్కువైనది. కమలాక్షుడగు శ్రీహరి, పూజకు ఆటంకము కలుగకుండా, భక్తి పరవశత్వముతో, తన కంటినే కమలమునకు బదులుగా పరమేశ్వరునికి సమర్పించుటకు ఉద్యుక్తుడవుతాడు. వెంటనే పరమశివుడు ప్రత్యక్షమై, విష్ణువును వారించి, అమితానందముతో ఆలింగనము చేసుకుని, విష్ణువునకు సుదర్శన చక్రమును అనుగ్రహిస్తాడు.

(3) ఈ శ్లోకమునందు శంకరాచార్యులవారు పరమశివుని విరాట్ స్వరూపమునుగూర్చి ప్రత్యక్షముగా చెప్పకనే, కన్నులకు కట్టినట్లు చూపిస్తారు!


Saturday 6 October 2012

Sivanandalahari-29

 త్వత్పాదాంబుజమర్చయామి పరమం త్వాం చిన్తయామ్యన్వహం
త్వామీశం శరణం వ్రజామి వచసా త్వామేవ యాచే విభో
వీక్షాం మే దిశ చాక్షుషీం సకరుణాం దివ్యైశ్చిరం ప్రార్థితాం
శంభో లోక గురో మదీయమనసస్సౌఖ్యోపదేశం కురు (29)

త్వద్ = నీ
పాద అంబుజం = పాదారవిందములను
అర్చయామి = అర్చించెదను
పరమం త్వాం = సర్వోత్కృష్టుడవగు నీగూర్చి
చిన్తయామి = చింతన చేసెదను
అన్వహం = ప్రతిరోజు
త్వాం ఈశం = ఓ ఈశ్వరా నిన్ను
శరణం వ్రజామి = శరణు వేడెదను
వచసా = వాక్కులతో
త్వాం ఏవ యాచే = కేవలము నిన్నే యాచించెదను
విభో = ఓ విభో, సర్వవ్యాపీ
వీక్షాం = వీక్షణములను
మే దిశ = నాపై ప్రసరింపజేయుము
చాక్షుషీం = కన్నుల
సకరుణాం = కారుణ్యముతో నిండిన
దివ్యైః = దివ్యులచే
చిరం ప్రార్థితాం = ఎప్పటినుంచో ప్రార్ధింపబడుచున్నట్టివి
శంభో లోకగురో = ఓ శంభో, ఆనందమును ప్రసాదించువాడా, ఓ లోకగురో
మదీయ మనసః= నా మనస్సునకు
సౌఖ్య ఉపదేశం కురు = ఆనందమును ప్రసాదించు ఉపదేశమును చేయుము

నీ పాదారవిందములను అర్చించెదను. సర్వోత్కృష్టుడవగు నీగూర్చి ప్రతిరోజు చింతన చేసెదను. ఓ ఈశ్వరా, నిన్ను శరణు వేడెదను. ఓ విభో, నా వాక్కులతో కేవలము నిన్నే యాచించెదను. దివ్యులచే ఎప్పటినుంచో ప్రార్ధింప బడుచున్నట్టివి అగు నీ కరుణాపూరిత కృపాకటాక్ష వీక్షణములను నాపై ప్రసరింపజేయుము. ఓ శంభో, ఓ లోకగురో, నా మనస్సునకు ఆనందమును ప్రసాదించు ఉపదేశమును చేయుము.
  

Sivanandalahari-28

సారూప్యం తవ పూజనే శివ మహాదేవేతి సంకీర్తనే
సామీప్యం శివభక్తి ధుర్యజనతా సాంగత్య సంభాషణే

సాలోక్యం చ చరాచరాత్మక తను ధ్యానే భవానీపతే
సాయుజ్యం మమసిధ్దమత్రభవతి స్వామిన్ కృతార్థోஉస్మి అహమ్ (28)

సారూప్యం = సారూప్యము (ఈశ్వరునివంటి రూపము/గుణములు)
తవ పూజనే = నీ పూజనమువలన సిద్ధించును
శివ మహాదేవ ఇతి = "శివా", "మహాదేవా" ఇత్యాది నామముల
సంకీర్తనే = సంకీర్తనముచే
సామీప్యం = నీ సామీప్యము సిద్ధించును (సామీప్యము= సమీపమున ఉండుట)
శివ భక్తి ధుర్యజనతా = శివభక్తి ధురంధరులైన జనులయొక్క
సాంగత్య = సాంగత్యము
సంభాషణే = సంభాషణలవలన
సాలోక్యం చ = సాలోక్యత సిద్ధించును (సాలోక్యము = ఒకేచోట నివసించుట) మరియు
చర అచర = చరాచరములన్నింటియందు
ఆత్మక తను = ఉన్నట్టి నీ తనువును
ధ్యానే = ధ్యానించుటచే
భవానీ పతే = ఓ భవానీపతీ
సాయుజ్యం = నీ సాయుజ్యము లభించును (సాయుజ్యము = ఏకమగుట)
మమ సిధ్దం అత్ర భవతి = నాకు ఇది ఇచటనే తప్పక జరిగితీరును
స్వామిన్ = ఓ స్వామీ
కృతార్థః అస్మి అహం = నేను కృతార్థుడను

నీ పూజనమువలన సారూప్యము సిద్ధించును. "శివా", "మహాదేవా" ఇత్యాది నీ నామముల సంకీర్తనముచే నీ సామీప్యము సిద్ధించును. శివభక్తి ధురంధరులైన జనులయొక్క సాంగత్య సంభాషణలవలన నీతో సాలోక్యత సిద్ధించును, మరియు ఓ భవానీపతీ, చరాచరములన్నింటియందు ఉన్నట్టి నీ తనువును ధ్యానించుటచే నీ సాయుజ్యము లభించును. నాకు ఇది ఇచటనే తప్పక జరిగితీరును. ఓ స్వామీ, నిన్ను ఆశ్రయించుటవలన నేను కృతార్థుడను.

Friday 5 October 2012

Sivanandalahari-27

కరస్థే హేమాద్రౌ గిరిశ నికటస్థే ధనపతౌ
గృహస్థే స్వర్భూజాஉమర సురభి చిన్తామణిగణే
శిరస్థే శీతాంశౌ చరణయుగలస్థేஉఖిలశుభే
కమర్థం దాస్యేஉహం భవతు భవదర్థం మమ మనః (27)

కరస్థే = (నీ) చేతియందు
హేమాద్రౌ = బంగారు కొండ (మేరు పర్వతం) ఉన్నది
గిరిశ = ఓ గిరిశ, గిరులయందు వసించువాడా
నికటస్థే = (నీ) సన్నిధిలో
ధనపతౌ = ధనాధిపతి (కుబేరుడు) ఉన్నాడు
గృహస్థే = ఇంటియందు
స్వర్భూజా = కల్పవృక్షము
అమర సురభి = కామధేనువు
చిన్తామణి గణే = చింతామణి (తో కూడిన) సమూహము ఉన్నది
శిరస్థే = శిరస్సుపై
శీతాంశౌ = చల్లదనమునిచ్చు చంద్రుడు ఉన్నాడు
చరణ యుగలస్థే = (నీ) పాదారవిందములవద్ద
అఖిల శుభే = సకల శుభములు ఉన్నాయి
కం అర్థం దాస్యేహం = (అలాంటి నీకు) నేను ఏమి సమర్పించను?
భవతు భవదర్థం = నీది అగుగాక
మమ మనః = నా మనస్సు

ఓ గిరిశ, నీ చేతియందు సువర్ణమయమైన మేరు పర్వతం ఉన్నది. నీ సన్నిధిలో ధనాధిపతియైన కుబేరుడు ఉన్నాడు. నీ ఇంటియందు కల్పవృక్షము, కామధేనువు, చింతామణుల సమూహమే ఉన్నది. నీ శిరస్సుపై చల్లదనమునిచ్చు చంద్రుడు ఉన్నాడు. ఇక నీ పాదారవిందములవద్ద సకల శుభములు ఉన్నాయి. అలాంటి నీకు నేను ఏమి సమర్పించను? నా మనస్సు నీది అగుగాక.

Thursday 4 October 2012

Sivanandalahari-26

కదా వా త్వాం దృష్ట్వా గిరిశ తవ భవ్యాంఘ్రియుగలం
గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహన్
సమాశ్లిష్యాఘ్రాయ స్ఫుట జలజ గన్ధాన్ పరిమలా
నలభ్యాం బ్రహ్మాద్యైర్ముదమనుభవిష్యామి హృదయే (26)


కదా వా = ఎప్పుడు
త్వాం దృష్ట్వా = నిన్ను దర్శించి
గిరిశ = ఓ గిరిశ, గిరులయందు వసించువాడా
తవ భవ్యాంఘ్రి యుగలం = నీ దివ్య పాదారవిందములను
గృహీత్వా హస్తాభ్యాం = చేతులలోనికి తీసుకుని
శిరసి = శిరస్సుపైనను
నయనే = నేత్రములపైనను
వక్షసి = వక్షస్థలముపైనను
వహన్ = హత్తుకుని
సమాశ్లిష్య = వాటిని గాఢాలింగనము చేసుకుని
ఆఘ్రాయ = ఆఘ్రాణించి
స్ఫుట జలజ = అరవిరిసిన తామరపూవులవంటి
గన్ధాన్ పరిమలాన్ = సుగంధ పరిమళములను
అలభ్యాం = అలభ్యమైన
బ్రహ్మాద్యైః = బ్రహ్మాదులకు సైతం
ముదం అనుభవిష్యామి = పరమానందమును అనుభవించెదను
హృదయే = నా హృదయమునందు

ఓ గిరిశ, నేను ఎప్పుడు నిన్ను దర్శించి, నీ దివ్య పాదారవిందములను నా చేతులలోనికి తీసుకుని, వాటిని నా శిరస్సుపైనను, నేత్రములపైనను, వక్షస్థలముపైనను హత్తుకుని, వాటిని తనివితీరా గాఢాలింగనము చేసుకుని, అవి వెదజల్లెడు అరవిరిసిన తామరపూవులవంటి సుగంధ పరిమళములను తృప్తితీరా ఆఘ్రాణించి, బ్రహ్మాదులకుకూడా అలభ్యమైన పరమానందమును నా హృదయమునందు అనుభవించెదను?

కొన్ని వివరణలు:
 
(1) 24వ శ్లోకంలో శంకరాచార్యులవారు మనలను కైలాసంపైనున్న పరమేశ్వరునియొక్క సువర్ణ మణిమయ సౌధంలోనికి తీసుకువెళ్ళారు. 25వ శ్లోకంలో ఆ సౌధములో నందీశ్వరుని మూపురముపై ఆశీనుడై, బ్రహ్మాదులుచే స్తుతింపబడుచున్న ఈశ్వరునియొక్క దర్శనమును దగ్గరుండి చేయించారు. ఇక ఈ 26వ శ్లోకములో మనచేత సాక్షాత్తు శివునియొక్క పాదారవిందములకు గాఢాలింగన సహిత ప్రణామములను చేయించారు.

Wednesday 3 October 2012

Sivanandalahari-25

 స్తవైః బ్రహ్మాదీనాం జయ జయ వచోభిర్నియమినాం
గణానాం కేలీభిర్మదకల మహోక్షస్య కకుది
స్థితం నీలగ్రీవం త్రినయనముమాశ్లిష్ట వపుషం
కదా త్వాం పశ్యేయం కరధృత మృగం ఖణ్డపరశుమ్ (25)

స్తవైః బ్రహ్మాదీనాం = బ్రహ్మాదులు స్తుతించుచుండగా
జయ జయ వచోభిః నియమినాం = యోగీశ్వరులు జయజయ ధ్వానములు చేయుచుండగా
గణానాం కేలీభిః = ప్రమథ గణములు ఆడుచుండగా
మదకల = పరవశించియున్నట్టి
మహోక్షస్య కకుది = నందీశ్వరుని మూపురముపై
స్థితం = ఆసీనుడవైయుండగా
నీలగ్రీవం = నీలకంఠుడవు
త్రినయనం = త్రినేత్రుడవు
ఉమా ఆశ్లిష్ట వపుషం = పార్వతీదేవిచే ఆలింగనము చేసుకొనబడిన శరీరము కలవాడవు
కదా త్వాం పశ్యేయం = నిన్ను ఎప్పుడు చూస్తాను?
కర ధృత మృగం = కరములయందు (మాయకు చిహ్నమైన) లేడిని ధరించినవాడవు
ఖణ్డపరశుం = (మరియు) గండ్ర గొడ్డలిని

కరములయందు లేడిని, గండ్ర గొడ్డలిని ధరించినవాడవు, నీలకంఠుడవు, త్రినేత్రుడవు, పార్వతీదేవిచే ఆలింగనము చేసుకొనబడిన శరీరము కలవాడవు అగు నీవు, పరవశించియున్నట్టి నందీశ్వరుని మూపురముపై ఆసీనుడవైయుండగా, ప్రమథ గణములు ఆడుచుండగా, బ్రహ్మాదులు స్తుతించుచుండగా, యోగీశ్వరులు జయజయ ధ్వానములు చేయుచుండగా, నిన్ను ఎప్పుడు చూస్తాను?

Tuesday 2 October 2012

Sivanandalahari-24

కదా వా కైలాసే కనకమణిసౌధే సహగణై
ర్వసన్ శంభోరగ్రే స్ఫుట ఘటిత మూర్ధాంజలిపుటః |
విభో సాంబ స్వామిన్ పరమశివ పాహీతి నిగదన్
విధాతృణాం కల్పాన్ క్షణమివ వినేష్యామి సుఖతః || (24)

కదా వా = ఎప్పుడు
కైలాసే = కైలాస శిఖరముపై
కనక మణి సౌధే = సువర్ణ మణిమయ సౌధమునందు
సహ గణైః వసన్ = ప్రమథగణ సమేతుడైయున్న
శంభోః అగ్రే = పరమేశ్వరుని ముందు
స్ఫుట ఘటిత మూర్ధాంజలి పుటః = శిరస్సుపై జోడింపబడిన కరములతో నిలిచి
విభో = ఓ విభో, సర్వవ్యాపీ
సాంబ = ఓ సాంబశివా (అమ్మవారితో కూడియున్న శివా),
స్వామిన్ = ఓ స్వామీ
పరమశివ = ఓ పరమశివా
పాహి ఇతి నిగదన్ = పాహిమాం పాహిమాం అని స్తుతించుచూ
విధాతృణాం కల్పాన్ = బ్రహ్మ కల్పాలనుకూడా
క్షణం ఇవ = క్షణ కాలమువలే
వినేష్యామి = గడిపెదనో కదా
సుఖతః = ఆనందముతో

కైలాస శిఖరముపై, సువర్ణ మణిమయ సౌధమునందు, ప్రమథగణ సమేతుడైయున్న పరమేశ్వరుని ముందు, శిరస్సుపై జోడింపబడిన కరములతో నిలిచి, "ఓ విభో, ఓ సాంబశివా, ఓ స్వామీ, ఓ పరమశివా, పాహిమాం పాహిమాం" అని స్తుతించుచూ, బ్రహ్మ కల్పాలనుకూడా క్షణ కాలమువలే ఆనందముతో ఎప్పుడు గడిపెదనో కదా!

కొన్ని వివరణలు:

(1) ఈ శ్లోకమునందు మరియు రాబోయే రెండు శ్లోకములలోనూ (25,26), శంకారాచార్యులవారు మనచేత కైలాసపతి యొక్క అద్భుత దర్శనము చేయిస్తారు!



Monday 1 October 2012

Sivanandalahari-23

కరోమి త్వత్పూజాం సపది సుఖదో మే భవ విభో
విధిత్వం విష్ణుత్వం దిశసి ఖలు తస్యాః ఫలమితి |
పునశ్చ త్వాం ద్రష్టుం దివి భువి వహన్ పక్షి మృగతా
మదృష్ట్వా తత్ ఖేదం కథమిహ సహే శంకర విభో || (23)

కరోమి = చేసెదను
త్వత్ పూజాం = నీ పూజ
సపది = తక్షణమే
సుఖదో మే భవ = నాకు సుఖములను ప్రసాదించుము
విభో = ఓ విభో, సర్వవ్యాపీ
విధిత్వం = బ్రహ్మ పదవి
విష్ణుత్వం = విష్ణు పదవి
దిశసి ఖలు = నీవు ప్రసాదించివేస్తే
తస్యాః ఫలం ఇతి = (నా పూజకు) ఫలముగా
పునః చ  = అప్పుడు మరలా
త్వాం ద్రష్టుం = నిన్ను దర్శించడానికి
దివి భువి వహన్ = ఆకాశము మరియు భూములయందు సంచరించి
పక్షి మృగతాం = పక్షిగాను మరియు మృగముగాను
అదృష్ట్వా = దర్శించలేక
తత్ ఖేదం = ఆ ధుఃఖమును
కథం ఇహ సహే = ఎలా ఇక్కడ భరించగలను
శంకర = ఓ శంకరా, ఆనంద ప్రదాయకా
విభో = ఓ విభో, సర్వవ్యాపీ

నీ పూజ చేసెదను. ఓ విభో, నాకు తక్షణమే సుఖములను ప్రసాదించుము. పూజకు ఫలముగా నీవు బ్రహ్మ పదవో లేక విష్ణు పదవో ప్రసాదించివేస్తే, అప్పుడు నిన్ను మరలా దర్శించడానికి ఆకాశము మరియు భూములయందు పక్షిగానో లేక మృగముగానో సంచరించవలసి వస్తుంది. నిన్ను దర్శించలేక, ఓ శంకరా, ఆ ధుఃఖమును ఎలా ఇక్కడ భరించగలను విభో.


కొన్ని వివరణలు:

(1) పురాణ గాధ ప్రకారము: ఒకసారి బ్రహ్మ విష్ణువుల నడుమ తమలో ఎవరు గొప్ప అని సంవాదం జరిగింది. ఈ విషయం తేల్చుకోవడానికి వారిద్దరూ పరమశివుని వద్దకు వెళ్ళారు. అప్పుడు పరమశివుడు అగ్నిస్తంభ రూపములో వారి మధ్యన ఆవిర్భవించి, "మీ ఇరువురిలో ఎవరు నా ఆద్యంతాలను ముందుగా దర్శించి చెబుతారో వారే గొప్పవారు" అని చెప్పాడు. ఈ మాటలు విన్న బ్రహ్మ హంస రూపంతోను, విష్ణువు వరాహ రూపంతోను సిద్ధమయ్యారు. హంస రూపియైన బ్రహ్మ శిరోభాగాన్ని వెతుకుతూ నింగిపైకి వెళ్లగా, వరాహ రూపియైన విష్ణువు పాదభాగాన్ని అన్వేషిస్తూ భూమిలోకి వెళ్లసాగాడు. అలా వేల సంవత్సరాలపాటు వెదికినప్పటికీ వారు పరమేశ్వరునియొక్క ఆద్యంతాలను దర్శించలేకపోయినట్లు ఐతిహ్యము. శ్రీ శంకరాచార్యులవారు ఈ గాధను అడ్డంపెట్టుకుని, చక్కటి "హస్య రసము" మరియు "భక్తుని హృదయంలో భగవంతుని ఎడల గల విరహ భావన" ల సమ్మేళనముతో ఈ చమత్కారమైన శ్లోకాన్ని ఆవిష్కరించారు.

Saturday 29 September 2012

Sivanandalahari-22

ప్రలోభాద్యైరర్థాహరణ పరతన్త్రో ధని గృహే
ప్రవేశోద్యుక్తస్సన్ భ్రమతి బహుధా తస్కరపతే |
ఇమం చేతశ్చోరం కథమిహ సహే శంకర విభో
తవాధీనం కృత్వా మయి నిరపరాధే కురు కృపామ్ || (22)

ప్రలోభ ఆద్యైః = దురాశ ఇత్యాది ప్రలోభములచే
అర్థాహరణ = సంపదలను దొంగిలించుట
పరతన్త్రః = ఇతరమైనవాటికి లోబడి
ధని గృహే = ధనికులైనవారి గృహములందు
ప్రవేశ ఉద్యుక్తః సన్ = ప్రవేశించుటకు ఉద్యుక్తుడై
భ్రమతి బహుధా = పరిపరి విధముల తిరుగుచున్నది
తస్కరపతే = ఓ తస్కరపతీ, దొంగలందరకూ ప్రభువైనవాడా (మనసును దోచుకొనువాడా)
ఇమం చేతః చోరం = ఈ మనస్సు అనే దొంగను
కథం ఇహ సహే = ఏవిధముగా భరించను?
శంకర = ఓ శంకరా,  ఆనందమును ప్రసాదించువాడా
విభో = ఓ విభో, సర్వవ్యాపీ
తవ అధీనం కృత్వా = నీ ఆధీనము చేసుకుని
మయి నిరపరాధే  = నిరపరాధినైన నాపై
కురు కృపాం = కృప జూపుము

ఓ తస్కరపతీ, నా మనస్సు అనే దొంగ, దురాశ ఇత్యాది ప్రలోభములచే, ఇతరుల సంపదలను దొంగిలించుటకు, ధనికులైనవారి గృహములందు ప్రవేశించుటకు ఉద్యుక్తుడై, పరిపరి విధముల తిరుగుచున్నది. ఓ శంకరా, ఈ మనస్సు అనే దొంగను ఏవిధముగా భరించను? ఓ విభో, దీనిని నీ ఆధీనము చేసుకుని, నిరపరాధినైన నాపై కృప జూపుము.

Sunday 23 September 2012

Sivanandalahari-21

ధృతిస్తంభాధారాం దృఢగుణ నిబధ్దాం సగమనాం
విచిత్రాం పద్మాఢ్యాం ప్రతిదివస సన్మార్గ ఘటితామ్ |
స్మరారే మచ్చేతః స్ఫుట పట కుటీం ప్రాప్య విశదాం
జయ స్వామిన్ శక్త్యా సహ శివగణైస్సేవిత విభో || (21)

ధృతి స్తంభ ఆధారాం = 'కృత నిశ్చయము' అనే స్థంబమును అధారముగా చేసుకుని
దృఢ గుణ నిబధ్దాం = 'పట్టుదల' అనే త్రాళ్ళతో కట్టబడి
సగమనాం = కదిలే సామర్ధ్యము కలిగినది
విచిత్రాం = విచిత్రమైనది
పద్మాఢ్యాం = పద్మము ఆకృతిలోనున్నది
ప్రతి దివస = ప్రతిరోజు
సన్మార్గ ఘటితాం = సన్మార్గమునందు ఉంచబడునట్టిది
స్మర అరే = ఓ స్మరారీ, (మన్మధునియొక్క శత్రువు)
మద్ చేతః = నా మనస్సు
స్ఫుట పట కుటీం = తెల్లని వస్త్రముతో చేయబడిన కుటీరము
ప్రాప్య = చేరుకొనుము
విశదాం = నిర్మలమైనట్టిది
జయ = జయమగుగాక
స్వామిన్ = ఓ స్వామీ
శక్త్యా సహ = శక్తి (పార్వతీదేవి) సమేతుడవై
శివ గణైః సేవిత = శివ గణములచే సేవింపబడునట్టి
విభో = ఓ విభో, సర్వవ్యాపీ

ఓ స్మరారీ, 'కృత నిశ్చయము' అనే స్థంబమును అధారముగా చేసుకుని, 'పట్టుదల' అనే త్రాళ్ళతో కట్టబడి, కదిలే సామర్ధ్యము కలిగినది, విచిత్రమైనది, పద్మము ఆకృతిలోనున్నది, ప్రతిరోజు సన్మార్గమునందు ఉంచబడునట్టిది, తెల్లని వస్త్రముతో చేయబడిన నిర్మలమైన నా మనస్సు అనే కుటీరమును పార్వతీ సమేతుడవై చేరుకొనుము. శివ గణములచే సేవింపబడునట్టి ఓ స్వామీ, ఓ విభో, నీకు జయమగుగాక.

Saturday 22 September 2012

Sivanandalahari-20

సదా మోహాటవ్యాం చరతి యువతీనాం కుచ గిరౌ
నటత్యాశా శాఖాస్వటతి ఝటితి స్వైరమభితః |
కపాలిన్ భిక్షో మే హృదయ కపిమత్యన్త చపలం
దృఢం భక్త్యా బధ్ద్వా శివ భవదధీనం కురు విభో || (20)


సదా = నిరంతరమూ
మోహ అటవ్యాం = మోహము అనెడి అరణ్యమునందు
చరతి = చరించుచున్నది
యువతీనాం కుచ గిరౌ = యువతుల కుచగిరులపై
నటతి = నాట్యము చేయుచున్నది
ఆశా శాఖాసు = ఆశ అనెడి కొమ్మలపై
అటతి = తిరుగుచున్నది
ఝటితి = వేగముగా
స్వైరం = ఇష్టమొచ్చినట్లు
అభితః = అన్నివైపులకు
కపాలిన్ = ఓ కపాలీ (చేతియందు కపాలమును భిక్షాపాత్రగా ధరించినవాడా)
భిక్షో = ఓ ఆదిభిక్షూ
మే హృదయ కపిం = నా మనస్సు అనే కోతి
అత్యన్త చపలం = అత్యంత చపలమైనది
దృఢం భక్త్యా బధ్ద్వా = భక్తితో బలంగా కట్టివేసి
శివ = ఓ పరమశివా
భవదధీనం కురు = నీ స్వాధీనము చేసుకో
విభో = ఓ విభో, సర్వవ్యాపీ

నా మనస్సు నిరంతరమూ మోహము అనెడి అరణ్యమునందు చరించుచు, యువతుల కుచగిరులపై నాట్యము చేయుచు, ఆశ అనెడి కొమ్మలపై వేగముగా అన్నివైపులకు స్త్వైర విహారము చేయుచున్నది. ఓ కపాలీ, ఓ ఆదిభిక్షూ, అత్యంత చపలమైన ఈ 'నా మనస్సు' అనే కోతిని,  భక్తి అనే త్రాడుతో బలంగా కట్టివేసి, ఓ శివా, ఓ విభో, దానిని నీ స్వాధీనము చేసుకో.

Sivanandalahari-19

దురాశా భూయిష్ఠే దురధిప గృహద్వార ఘటకే
దురన్తే సంసారే దురిత నిలయే దుఃఖజనకే
మదాయాసం కిం న వ్యపనయసి కస్యోపకృతయే
వదేయం ప్రీతిశ్చేత్ తవ శివ కృతార్థాః ఖలు వయమ్ (19)

దురాశా భూయిష్ఠే = దురాశా భూయిష్ఠమైనది
దురధిప = దుష్టులైన యజమానుల
గృహద్వార ఘటకే = గృహద్వారములవద్దకు చేర్చునది
దురన్తే సంసారే = అంతులేని సంసార చక్రమునందు
దురిత నిలయే = దురితములకు నిలయము
దుఃఖ జనకే  = దుఃఖములకు పుట్టినిల్లు
మద్ ఆయాసం = నా ఆయాసమును
కిం న వ్యపనయసి = (నీవు) ఎందుకు తొలగించుటలేదు?
కస్య ఉపకృతయే = ఎవరికి మేలు చెయ్యడముకోసం?
వద = చెప్పవయ్యా
ఇయం ప్రీతిః చేత్ తవ = ఇదే నీవు నీ వాత్సల్యమునుచూపు విధానమైతే
శివ = ఓ పరమశివా!
కృతార్థాః ఖలు = నిజంగా కృతార్థులమే
వయం = మేము

దురాశా భూయిష్ఠమైనది, దుష్టులైన యజమానుల గృహద్వారములవద్దకు చేర్చునది, దురితములకు నిలయము, దుఃఖములకు పుట్టినిల్లు అయిన ఈ అంతులేని సంసార చక్రమునందు నా ఆయాసమును నీవు ఎందుకు తొలగించుటలేదు? ఎవరికి మేలు చెయ్యడముకోసమో చెప్పవయ్యా! ఓ పరమశివా, ఇదే నీవు నీ వాత్సల్యమునుచూపు విధానమైతే, మేము నిజంగా కృతార్థులమే!

Thursday 20 September 2012

Sivanandalahari-18

త్వమేకో లోకానాం పరమఫలదో దివ్య పదవీం
వహన్తస్త్వన్మూలాం పునరపి భజన్తే హరిముఖాః |
కియద్వా దాక్షిణ్యం తవ శివ మదాశా చ కియతీ
కదా వా మద్రక్షాం వహసి కరుణా పూరిత దృశా || (18)


త్వం ఏకః = నీవు ఒక్కడివే
లోకానాం = మానవులకు
పరమ ఫలదః = పరమ ఫలమును (ముక్తిని) ప్రసాదించువాడవు
దివ్య పదవీం వహన్తః = దివ్యమైన పదవులను పొందినవారు
త్వత్ మూలాం = నీ మూలముగా
పునః అపిభజన్తే = తిరిగి నిన్నే పూజించుచున్నారు
హరి ముఖాః = అట్టివారందరిలో ముఖ్యుడు శ్రీహరి
కియత్ వా = ఎంత (ఉదారమైనదో)
దాక్షిణ్యం తవ శివ = నీ కారుణ్యము, ఓ శివా
మద్ ఆశా చ = నాయొక్క ఆశకూడా
కియతీ = ఎంత (అంతులేనిదో)
కదా వా = మరి ఎప్పుడు
మద్ రక్షాం = నా రక్షణ భారమును
వహసి = (నీవు) వహించెదవు?
కరుణా పూరిత దృశా = కారుణ్యముతోనిండిన నీ దృష్టిద్వారా

నీవు ఒక్కడివే మానవులకు పరమ ఫలమును (ముక్తిని) ప్రసాదించువాడవు. నీ మూలముగా దివ్యమైన పదవులను పొందినవారుకూడా, అట్టివారందరిలో ముఖ్యుడగు శ్రీహరితో సహా, పునః పునః నిన్నే పూజించుచున్నారు. ఓ శివా! నీ కారుణ్యము ఎంత ఉదారమైనదో కదా! నాయొక్క ఆశకూడా ఎంత అంతులేనిదో! మరి నీవు కారుణ్యముతోనిండిన నీ దృష్టిద్వారా నా రక్షణ భారమును ఎప్పుడు వహించెదవు?

Wednesday 19 September 2012

Sivanandalahari-17

ఫలాద్వా పుణ్యానాం మయి కరుణయా వా త్వయి విభో
ప్రసన్నేஉపి స్వామిన్ భవదమల పాదాబ్జ యుగలమ్
కథం పశ్యేయం మాం స్థగయతి నమస్సంభ్రమజుషాం
నిలింపానాం శ్రేణిర్నిజ కనక మాణిక్య మకుటైః (17)

ఫలాత్ వా పుణ్యానాం = పుణ్యఫలము వలనగానీ
మయి కరుణయా వా = లేదా నాపై (నీకుగల) కారుణ్యము వలనగానీ
త్వయి = నీవు
విభో = ఓ విభో, సర్వవ్యాపీ
ప్రసన్నే అపి = ప్రసన్నుడవైననూ (ప్రత్యక్షమైననూ)
స్వామిన్ = ఓ స్వామీ
భవతః = నీయొక్క
అమల పాద అబ్జ యుగలమ్ = నిర్మల పాదారవిందములను
కథం పశ్యేయం = ఎలా దర్శించగలను?
మాం స్థగయతి = (అవి) నానుండి దాచబడినవి
నమః సంభ్రమజుషాం = సంభ్రమముతో (సాష్టాంగ) ప్రణామములు చేయుచున్నట్టి
నిలింపానాం శ్రేణిః = దేవతా బృందముల
నిజ కనక మాణిక్య మకుటైః = వారి సువర్ణ మణిమయ కిరీటములవలన

పుణ్యఫలము వలనగానీ, లేదా నాపై నీకుగల కారుణ్యము వలనగానీ, ఓ విభో, ఓ స్వామీ, నీవు ప్రత్యక్షమైననూ, నీ నిర్మల పాదారవిందములను ఎలా దర్శించగలను? సంభ్రమముతో సాష్టాంగ ప్రణామములు చేయుచున్నట్టి దేవతా బృందముల సువర్ణ మణిమయ కిరీటములవలన నీ పాదారవిందములు నానుండి దాచబడినవి.

Sunday 16 September 2012

Sivanandalahari-16

విరించిర్దీఘాయుర్భవతు భవతా తత్పరశిర
శ్చతుష్కం సంరక్ష్యం స ఖలు భువి దైన్యం లిఖితవాన్ |
విచారః కో వా మాం విశద కృపయా పాతి శివ తే
కటాక్ష వ్యాపారః స్వయమపి చ దినావన పరః || (16)

విరించిః = బ్రహ్మ
దీర్ఘాయుః భవతు = దీర్ఘాయుష్మంతుడు అగుగాక
భవతా = నీచేత
తత్ పరః శిరః చతుష్కం = ఆ మిగిలిన నాలుగు శిరస్సులు
సంరక్ష్యం = సంరక్షింపబడుగాక
సః ఖలు = సాక్షాత్తు ఆయనే
భువి = ఈ భూమిమీద
దైన్యం లిఖితవాన్ = దైన్యమును అనుభవించమని (నా లలాటమున) లిఖించినవాడు
విచారః కః వా మాం = (అయినా) దీనినిగూర్చి నాకు చింత ఎందుకు?
విశద = ఓ విశదా, ప్రసన్న స్వరూపా
కృపయా పాతి = పరమకారుణ్యముతో రక్షించెడి
శివ = ఓ పరమశివా
తే కటాక్ష వ్యాపారః = నీ (ఒక్క) కృపా వీక్షణమే
స్వయం అపి = తనంత తానుగా
దీన అవన పరః = దీనులకు రక్షణనొసగగలదు

బ్రహ్మ దీర్ఘాయుష్మంతుడు అగుగాక! ఆయనయొక్క ఆ మిగిలిన నాలుగు శిరస్సులు నీచేత సంరక్షింపబడుగాక! ఈ భూమిమీద దైన్యమును అనుభవించమని నా లలాటమున లిఖించినవాడు సాక్షాత్తు ఆయనే. అయినా దీనినిగూర్చి నాకు చింత ఎందుకు? ఓ పరమశివా, ప్రసన్న స్వరూపా, నీ ఒక్క కృపా వీక్షణమే చాలు, అదే తనంత తానుగా నావంటి దీనులందరికీ రక్షణనొసగగలదు.

కొన్ని వివరణలు:

(1) బ్రహ్మదేవునిగూర్చి శంకరాచార్యులవారు సరదాగా హాస్యోక్తిగా పైవిధముగా వ్రాసారని నా అబిప్రాయము. ఎందుచేతనంటే, మన పూర్వ కర్మలతో సంబంధము లేకుండానే, ఇప్పుడు 'మనము దైన్యాన్ని అనుభవించాలి' అని బ్రహ్మ మన నుదుటన వ్రాసాసేసినాడని అనుకుందాము. అలా అనుకున్నప్పటికీ, అంతమాత్రమునకే, పరమశివుడు కోపము తెచ్చుకుని, బ్రహ్మయొక్క శిరస్సులను ఖండించవలసినంతటి ఘనకార్యములు మనమేంచేసాము గనుక?  అయితే ఈ శ్లోకము కేవలము హాస్యప్రధానమైనదే కాదన్నది సుస్పష్టము. జీవితములో దైన్య పరిస్థితులు ఎదురైనప్పటికీ, నిస్ప్రుహ పొందక, ధృఢచిత్తులై నిలబడగలగడానికి అవసరమైన దివ్యౌషధాన్ని ఈ శ్లోకంలో మనకు అందజేస్తున్నారు.

Sivanandalahari-15

ఉపేక్షా నో చేత్ కిన్న హరసి భవద్ ధ్యాన విముఖాం
దురాశా భూయిష్ఠాం విధి లిపిమశక్తో యది భవాన్ |
శిరస్తద్వైధాత్రం న నఖలు సువృత్తం పశుపతే
కథం వా నిర్యత్నం కరనఖ ముఖేనైవ లులితమ్ || (15)

ఉపేక్షా న చేత్ = ఉపేక్ష వహించడము కాకుంటే
కిం న హరసి = ఎందుకు హరించవు?
భవద్ ధ్యాన = నిన్ను ధ్యానించుటయందుగల
విముఖాం = విముఖతను
దురాశా భూయిష్ఠాం = దురాశా భూయిష్ఠతను
విధి లిపిం = విధాత వ్రాసిన తలరాత (మార్చుటలో)
అశక్తః = అశక్తుడవు
యది భవాన్ = నీవు అయినట్లయితే
శిరః తత్ వైధాత్రం = ఆ బ్రహ్మయొక్క శిరస్సును
న నఖలు = (సులభముగా) త్రుంచుటకు సాధ్యముకానిది
సువృత్తం = దిట్టముగానున్నదానిని
పశుపతే = ఓ పశుపతీ
కథం వా నిర్యత్నం = పెద్దగా ప్రయత్నమేమీ లేకుండగనే ఎలా
కరనఖ ముఖేన ఏవ = కేవలము నీ కొనగోటితో
లులితం = త్రుంచివేసినావు?

ఓ పశుపతీ, నీవు నాపట్ల ఉపేక్ష వహించడము కాకుంటే, నా ధ్యాన విముఖతను, దురాశా భూయిష్ఠతను ఎందుకు హరించడములేదు? పోనీ ఒకవేళ బ్రహ్మదేవుడు నన్ను అలానే జీవించమని నా నుదుట వ్రాసిన రాతను మార్చడములో నీవు అశక్తుడవు అని అనుకుందామనుకుంటే, అటువంటప్పుడు, సులభముగా త్రుంచుటకు సాధ్యముకానిది, దిట్టముగానున్న ఆ బ్రహ్మయొక్క శిరస్సునే, పెద్దగా ప్రయత్నమేమీ లేకుండగనే, కేవలము నీ కొనగోటితో ఎలా త్రుంచివేసినావు? 

కొన్ని వివరణలు:

(1) పురాణగాధ ప్రకారము, బ్రహ్మదేవునికికూడా మొదట్లో శివునివలే ఐదు తలలు ఉండేవి. ఒకసారి బ్రహ్మ తన శక్తి సామర్ద్యాల గురించి అహంకరించడంతో, బ్రహ్మయొక్క అహంకారాన్ని పోగొట్టడముకోసం, శివుడు తన కొనగోటితో బ్రహ్మయొక్క ఒక శిరస్సును త్రుంచివేసినాడు. దీనిని అధారముగా చేసుకుని, శంకరాచార్యులవారు పరమశివునితో ఈ రమణీయమైన భావాన్ని ఆవిష్కరించారు.

Saturday 15 September 2012

Sivanandalahari-14

 
ప్రభుస్త్వం దీనానాం ఖలు పరమబన్ధుః పశుపతే
ప్రముఖ్యో
హం తేషామపి కిముత బన్ధుత్వమనయోః |
త్వయైవ క్షన్తవ్యాశ్శివ మదపరాధాశ్చ సకలాః
ప్రయత్నాత్కర్తవ్యం మదవనమియం బన్ధు సరణిః || (14)

ప్రభుః త్వం = నీవు ప్రభువువు
దీనానాం = దీనులకు
ఖలు పరమబన్ధుః = అత్యంత ఆత్మీయుడవైన బంధువువు
పశుపతే = ఓ పశుపతీ
ప్రముఖ్యః అహం = నేను ప్రముఖుడను
తేషాం అపి = వారందరిలోకూడా
కిముత = ఇంతకంటే (ఏమి చెప్పాలి)
బన్ధుత్వం అనయోః  = ఈ ఇద్దరి మధ్యన గల సంబంధముగురించి
త్వయా ఏవ = నీవే
క్షన్తవ్యాః = క్షమించవలెను
శివ = ఓ శివా, పరమ మంగళదాయకా
మద్ అపరాధాః = నా అపరాధములు
సకలాః = అన్నింటినీ
ప్రయత్నాత్ కర్తవ్యం = (నీవు) ప్రయత్నపూర్వకముగా (ఆచరించవలిసిన) కర్తవ్యము
మద్ అవనం = నన్ను రక్షించుట
ఇయం బన్ధు సరణిః = బంధువులమధ్య వ్యవహారములు ఇలానే ఉండాలి

ఓ పశుపతీ! సర్వులకు ప్రభువువైన నీవు దీనులకు అత్యంత ఆత్మీయుడవైన బంధువువు. నేను ఆ దీనులందరిలోకెల్ల పరమ దీనుడను. మన ఇద్దరి మధ్యన గల సంబంధముగురించి ఇంతకంటే ఏమి చెప్పాలి? కావున పరమశివా, నా అపరాధములనన్నింటినీ నీవే క్షమించవలెను. నా రక్షణము నీవు ప్రయత్నపూర్వకముగా ఆచరించవలిసిన కర్తవ్యము; ఎందువల్లనంటే, బంధువులమధ్య వ్యవహారములు ఇలానే ఉండాలి!

Friday 14 September 2012

Sivanandalahari-13

అసారే సంసారే నిజభజన దూరే జడధియా
భ్రమన్తం మామన్ధం పరమ కృపయా పాతుముచితమ్ |
మదన్యః కో దీనస్తవ కృపణ రక్షాతి నిపుణ
స్త్వదన్యః కో వా మే త్రిజగతి శరణ్యః పశుపతే || (13)

అసారే సంసారే = నిస్సారమైన సంసారమునందు
నిజ భజన దూరే = ఆత్మవిచారణకు దూరముగా
జడ ధియా = (నా) మందబుద్ధి కారణముగా
భ్రమన్తం = పరిభ్రమించుచున్నాను
మాం అన్ధం = అంధుడనగు నేను
పరమ కృపయా = (నీవు) పరమ కరుణతో
పాతుం ఉచితం = రక్షణనొసగుట తగియున్నది
మద్ అన్యః  = నేను కాక
కః దీనః తవ = అంతకంటే దీనులైనవారు నీకు ఎవరున్నారు?
కృపణః రక్ష అతి నిపుణః = ఓ దీనరక్షణా పరాయణా
త్వద్ అన్యః కః వా = నీవుగాక ఇంకెవ్వరు
మే = నాకు
త్రిజగతి = ఈ త్రిభువనములలో
శరణ్యః = శరణ్యము?
పశుపతే = ఓ పశుపతీ, సర్వ జీవులకు ప్రభువైనవాడా

నిస్సారమైన సంసారమునందు, ఆత్మవిచారణకు దూరముగా, అంధుడనగు నేను, నా మందబుద్ధి కారణముగా పరిభ్రమించుచున్నాను. ఓ దీనరక్షణా పరాయణా, అట్టి నాకు, నీవు పరమ కరుణతో రక్షణనొసగుట తగియున్నది; నాకంటే దీనులైనవారు నీకు ఎవరున్నారు? ఓ పశుపతీ! ఈ త్రిభువనములలో కేవలము నీవే నాకు శరణ్యము

The above image is from: http://senderosdeiluminacion.bligoo.com/

Wednesday 12 September 2012

Sivanandalahari-12

గుహాయాం గేహే వా బహిరపి వనే వాஉద్రిశిఖరే
జలే వా వహ్నౌ వా వసతు వసతేః కిం వద ఫలమ్ |
సదా యస్యైవాన్తః కరణమపి శంభో తవ పదే
స్థితం చేద్యోగోஉసౌ స చ పరమయోగీ స చ సుఖీ || (12)

గుహాయాం గేహే వా = గుహలయందు లేదా గృహములయందు
బహిః అపి = లేదా ఆరుబయట ప్రదేశములయందు
వనే వా అద్రి శిఖరే = అరణ్యములయందు లేదా పర్వత శిఖరములయందు
జలే వా వహ్నౌ వా వసతు = జలమునందు లేదా అగ్నియందు వశించుచూ ఉండవచ్చుగాక
వసతేః = (అట్టి) నివాశమువలన
కిం వద ఫలం = ఏమి ప్రయోజనము సిద్ధించునో చెప్పుము
సదా = నిరంతరమూ
యస్య అన్తః కరణం అపి = ఎవని అంతఃకరణములుకూడా
శంభో = ఓ శంభో, ఆనందమును ప్రసాదించువాడా
తవ పదే స్థితం చేత్ = నీ పాదపద్మములయందే నిలచియుంటాయో
సః చ పరమ యోగీ = అట్టివాడు మాత్రమే పరమయోగి
సః చ సుఖీ = అట్టివాడు మాత్రమే సుఖమును అనుభవించుచున్నవాడు

మానవుడు గుహలయందు లేదా గృహములయందు, లేదా ఆరుబయట ప్రదేశములయందు, అరణ్యములయందు లేదా పర్వత శిఖరములయందు, జలమునందు లేదా అగ్నియందు ఎచటనైనా వశించుచూ ఉండవచ్చుగాక. అట్టి నివాశమువలన ఏమి ప్రయోజనము సిద్ధించునో చెప్పుము? (బాహ్య ఇంద్రియములతోపాటు) ఎవని అంతఃకరణములుకూడా నిరంతరమూ నీ పాదపద్మములయందే నిలచియుంటాయో, ఓ శంభో! అట్టివాడు మాత్రమే పరమయోగి; అట్టివాడు మాత్రమే అసలైన సుఖమును అనుభవించుచున్నవాడు.

Monday 10 September 2012

Sivanandalahari-11

వటుర్వా గేహీ వా యతిరపి జటీ వా తదితరో
నరో వా యః కశ్చిద్భవతు భవ కిం తేన భవతి |
యదీయం హృత్పద్మం యది భవదధీనం పశుపతే
తదీయస్త్వం శంభో భవసి భవభారం చ వహసి || (11)

వటుః వా గేహీ వా = బ్రహ్మచారి, లేదా గృహస్థు, లేదా
యతిః అపి జటీ వా = సన్యాసియైనా, లేదా జడలు కట్టినవాడైనా,
తత్ ఇతరః నరః వా = లేదా మరొక విధముగానున్న మానవుడు అయిననూ
యః కశ్చిత్ భవతు = అతను ఎవరైననూ అగుగాక
భవ = ఓ భవా (సర్వ ప్రాణుల ఉత్పత్తికి మూలమైనవాడా)
కిం తేన భవతి = ఎవరైతేనేమి?
యది ఇయమ్ = ఒకవేళ ఈ
హృద్ పద్మం = హృదయ పద్మముగనుక
యది భవదధీనం = నీ ఆధీనమైనచో
పశుపతే = ఓ పశుపతీ!
తదియః త్వం భవసి = నీవు అతనివాడవు అగుచున్నావు
శంభో = ఓ శంభో
భవభారం చ వహసి = అతని భవ భారములన్నింటినీకూడా నీవే మోయుచున్నావు

బ్రహ్మచారి అయినా, లేదా గృహస్థు అయినా, లేదా సన్యాసిగానున్నా, లేదా జడలుకట్టిన యోగిగానున్నా, లేదా ఇవి ఏవీగాక మరొక విధముగానైనా మానవుడు ఉండి యుండవచ్చునుగాక, ఏ రీతిగా ఉంటేమాత్రమేమి? ఓ పశుపతీ! ఒకవేళ వాని హృదయ పద్మముగనుక నీ అధీనమైనచో, అతను ఎవరు అన్నదానితో సంబంధము లేకుండా,  నీవే అతని వాడవై, వాని భవ భారములన్నింటినీ నీవే మోయుచున్నావు గదా!

కొన్ని వివరణలు:
(1) శివానందలహరి అంతా సమయాభావమువలన పారాయణము చేసుకోవడము కుదరనప్పుడు, నిత్య పారాయణ కోసమని, 10 అతిముఖ్య శ్లోకములను భగవాన్ శ్రీ రమణ మహర్షి తెలిపారు. అలా భగవాన్ రమణులు ఎంపికచేసిన 10 శ్లోకములలో ఈ శ్లోకము ఒకటి.

Sunday 9 September 2012

Sivanandalahari-10

నరత్వం దేవత్వం నగ వన మృగత్వం మశకతా
పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననమ్ |
సదా త్వత్పాదాబ్జ స్మరణ పరమానన్ద లహరీ
విహారాసక్తం చేత్ హృదయమిహ కిం తేన వపుషా || (10)

నరత్వం = మనుష్య జన్మ
దేవత్వం = దేవ జన్మ
నగ వన మృగత్వం = పర్వతములలో (లేదా) అరణ్యములలో మృగముగా
మశకతా = దోమగా
పశుత్వం = పశువుగా
కీటత్వం భవతు = (లేక) కీటకముగా జన్మను పొందినను
విహగత్వ ఆది జననమ్ = (లేదా) పక్షి ఇత్యాదులలో దేనిగా జన్మించినప్పటికీ,
సదా = ఎల్లపుడూ
త్వత్పాదాబ్జ స్మరణ = నీ పాద కమలముల చింతనము అనెడి
పరమానన్ద లహరీ = పరమానందదాయక ప్రవాహమునందే
విహార ఆసక్తం = విహరించవలెననెడి ఆసక్తి కలిగినటువంటి
చేత్ హృదయం ఇహ = హృదయము ఇక్కడ (నాయందు) ఉన్నట్లయితే
కిం తేన వపుషా = ఏ జీవిగా జన్మించితే మాత్రము (వచ్చిన నష్టం) ఏమి?

ఓ పరమశివా! మనుష్య జన్మకానీ, దేవ జన్మకానీ, పర్వతారణ్యములయందు మృగముగాకానీ, పశువు, దోమ, కీటకములు, పక్షులు ఇత్యాది జీవులలో దేనిగా నేను జన్మించినప్పటికీకూడ, నీ పాదాంబుజముల నిరంతర స్మరణమనెడి పరమానంద ప్రవాహములో విహరించుటయందు ఆసక్తి కలిగిన హృదయము నాకు కలిగినట్లయితే, ఎటువంటి శరీరములో జన్మను తీసుకుంటేమాత్రమేమి? (ఓ ఈశ్వరా! నాకు ఫలానా జన్మనే ప్రసాదించమని నిన్ను కోరను; పూర్వ కర్మానుసారము ఏ జీవిగానైననూ జన్మించెదనుగాక, కానీ పైన తెల్పినట్టి గుణములు కలిగిన హృదయమునుమాత్రము నాకు ప్రసాదించవలసినదిగా నిన్ను ప్రార్ధించుచున్నాను.)

కొన్ని వివరణలు:
(1) శివానందలహరి అంతా సమయాభావమువలన పారాయణము చేసుకోవడము కుదరనప్పుడు, నిత్య పారాయణ కోసమని, 10 అతిముఖ్య శ్లోకములను భగవాన్ శ్రీ రమణ మహర్షి తెలిపారు. అలా భగవాన్ రమణులు ఎంపికచేసిన 10 శ్లోకములలో ఈ శ్లోకము ఒకటి.

Wednesday 5 September 2012

Sivanandalahari-9

గభీరే కాసారే విశతి విజనే ఘోరవిపినే
విశాలే శైలే చ భ్రమతి కుసుమార్థం జడమతిః |
సమర్పయ ఏకం చేతస్సరసిజముమానాథ భవతే
సుఖేనావస్థాతుం జన ఇహ న జానాతి కిమహో || (9)

గభీరే కాసారే = లోతైన సరస్సులలోనికి
విశతి = దిగుచున్నారు.
విజనే ఘోరవిపినే = జనసంచారములేని ఘోరారణ్యములలోను,
విశాలే శైలే చ = మరియు విశాల పర్వతములపైనను
భ్రమతి = పరిభ్రమిస్తున్నారు
కుసుమార్థం = పుష్పముల కొఱకు
జడమతిః = మందబుద్ధులు
సమర్పయ = సమర్పించవలెను
ఏకం చేతః సరసిజం = "మనస్సు" అనెడి ఒక్క పద్మమును
ఉమానాథ భవతే = ఓ ఉమాపతీ, నీకు.
సుఖేన అవస్థాతుం = పరమానందస్థితిని పొందుటకు.
జన ఇహ న జానాతి = జనులు ఈ విషయమును తెలుసుకొనలేకపోవుచున్నారు
కిం అహో = అయ్యో! ఎందుకు?

ఓ ఉమాపతీ, మందబుద్ధులు పుష్పముల కొఱకై, లోతైన సరస్సులలో దిగుచు, నిర్జన ఘోరారణ్యములలోను, విశాల పర్వతములపైనను పరిభ్రమిస్తూ ప్రయాస పడుచున్నారు. పరమానందస్థితిని పొందుటకు, నీకు సమర్పించవలసినది - ఈ బాహ్య పుష్పములుగాక, తమ హృదయ-పద్మములను కదా! అయ్యో, జనులు ఈ విషయమును ఎందుకు తెలుసుకొనలేకపోవుచున్నారు?

కొన్ని వివరణలు:
(1) శివానందలహరి అంతా సమయాభావమువలన పారాయణము చేసుకోవడము కుదరనప్పుడు, నిత్య పారాయణ కోసమని, 10 అతిముఖ్య శ్లోకములను భగవాన్ శ్రీ రమణ మహర్షి తెలిపారు. అలా భగవాన్ రమణులు ఎంపికచేసిన 10 శ్లోకములలో ఈ శ్లోకము ఒకటి.

Saturday 1 September 2012

Sivanandalahari-8

యథా బుధ్దిశ్శుక్తౌ రజతమితి కాచాశ్మని మణి
ర్జలే పైష్టే క్షీరం భవతి మృగతృష్ణాసు సలిలమ్ |
తథా దేవ భ్రాన్త్యా భజతి భవదన్యమం జడజనో
మహాదేవేశం త్వాం మనసి చ న మత్వా పశుపతే || (8)

యథా బుధ్దిః = ఏవిధముగా అయితే బుద్ధి
శుక్తౌ రజతం ఇతి = గుల్ల పెంకులను వెండియని (పొరబడుతుందో),
కాచాశ్మని మణిః = గాజుముక్కను మణియని,
జలే పైష్టే = పిండి కలిపిన నీటిని
క్షీరం భవతి = పాలుగాను,
మృగతృష్ణాసు = ఎండమావులను
సలిలమ్ = నీటిగాను (పొరబడుతుందో)
తథా = అదేవిధముగా
దేవ భ్రాన్త్యా = దైవముయొక్క విషయమునందు కలిగిన భ్రాంతివలన
భజతి భవదన్యం = మిమ్ములనుగాక, తదన్యమైనవాటిని భజించుచున్నారు
జడజనః = మందబుద్ధులైన జనులు.
మహాదేవేశం త్వాం = ఓ మహాదేవా, మిమ్ములను
మనసి చ న మత్వా = మనస్సునందు భావన చేయుటలేదు.
పశుపతే = ఓ పశుపతీ, సర్వజీవులకు ప్రభువైనవాడా

ఓ పశుపతీ, ఏవిధముగా అయితే బుద్ధి గుల్ల పెంకులను చూచి వెండియని, గాజుముక్కను మణియని, పిండి కలిపిన నీటిని క్షీరముగాను, ఎండమావులను చూచి నీటిగాను పొరబడుతుందో, అదేవిధముగా, మందబుద్ధులైన జనులు, దైవ విషయమున కలిగిన భ్రాంతివలన, దేవాధిదేవుడవగు మిమ్ములను మనస్సునందు భావన చేయక, తదన్యమైనవాటిని భజించుచున్నారు.