Monday 27 August 2012

Sivanandalahari-7

మనస్తే పాదాబ్జే నివసతు వచః స్తోత్ర ఫణితౌ
కరౌచాభ్యర్చాయాం శ్రుతిరపి కథాకర్ణన విధౌ |
తవ ధ్యానే బుధ్దిర్నయన యుగలం మూర్తి విభవే
పరగ్రన్థాన్ కైర్వా పరమశివ జానే పరమతః || (7)

మనః = మనస్సు
తే పాదాబ్జే = నీ పాదారవిందములయందు
నివసతు = వసించు గాక;
వచః = వాక్కు
స్తోత్ర ఫణితౌ = స్తుతించుటయందు;
కరౌ చ = మరియు కరములు
అభ్యర్చాయాం = పూజించుటయందు;
శ్రుతిః అపి = మరియు కర్ణములు
కథా ఆకర్ణన విధౌ = నీ కథా శ్రవణమనెడి విధియందును;
తవ ధ్యానే = నీ ధ్యానమునందు
బధ్దిః = బుద్ధి;
నయన యుగలం = నేత్రద్వయము
మూర్తి విభవే = నీ దివ్య మంగళ విగ్రహమును వీక్షించుటయందు;
పరగ్రన్థాన్ = ఇతర గ్రంధములద్వారా
కైః వా = ఏ విధముగా
పరమ శివ = ఓ పరమశివా, పరమ మంగళస్వరుపా
జానే పరం అతః = అంతకు మించి తెలుసుకొనగలను?

ఓ పరమశివా, నా మనస్సు నీ పాదారవిందములయందు వసించుగాక. అంతేగాక, నా వాక్కు నిన్ను స్తుతించుటయందును, నా కరములు నిన్ను పూజించుటయందును, నా కర్ణములు నీ కథాశ్రవణమనెడి విధియందును, నా బుద్ధి నీ ధ్యానమునందును, నా నేత్రద్వయము నీ దివ్య మంగళ విగ్రహమును వీక్షించుటయందును లగ్నమగుగాక. అటుల జరిగిన పిమ్మట, ఇక ఇతర గ్రంధములనుండి అంతకుమించి క్రొత్తగా తెలుసుకొనవలసినది ఏమి మిగిలియుండును?


Friday 24 August 2012

Sivanandalahari-6

  ఘటో వా మృత్పిణ్డోஉప్యణురపి చ ధూమోஉగ్నిరచలః
పటో వా తన్తుర్వా పరిహరతి కిం ఘోరశమనమ్ |
వృథా కణ్ఠక్షోభం వహసి తరసా తర్కవచసా
పదాంభోజం శంభోర్భజ పరమసౌఖ్యం వ్రజ సుధీః || (6)


ఘటో వా మృత్పిణ్డః అపి = కుండ అయినా, లేదా మట్టి అయినా
అణుః అపి = లేక (కేవలము) అణువులు అయినా
చ = అదే విధముగా
ధూమోగ్నిః అచలః = పొగ కనిపించుచున్నది కావున, బహుశా పర్వతముపై నిప్పు ఉండవలెను (మొ|| హేతువాదములూ)
పటుః వా తన్తుః వా = వస్త్రమా లేక దారములా (ఇత్యాది తర్కములు)
పరిహరతి కిం = పరిహరించగలవా?
ఘోరశమనం = ఘోరమగు మృత్యువును
వృథా = (నీవు) వ్యర్ధముగా
కణ్ఠక్షోభం = కంఠశోష
వహసి = పొందుచున్నావు
తరసా తర్కవచసా = తీవ్రమైన తర్క వాదములతో
పదాంభోజం శంభోః భజ = శంభుని పాదకమలములను భజింపుము
పరమసౌఖ్యం వ్రజ = (తద్వారా) పరమ సౌఖ్యములను పొందుము
ధీః = ఓ బుధ్ధిమంతుడా!

"కనబడుచున్న ఆ వస్తువు కుండయా? లేక మట్టియా? లేక అణువులా?" వంటి తర్క వాదములు; "దూరముగా ఆ కొండపై పొగ కనిపించున్నది కాబట్టి అచట నిప్పు ఉండి తీరవలెను" వంటి హేతువాదములు; "దీనిని వస్త్రముగా చూడవలెనా? లేక దారముల సమూహముగా చూడవలెనా?" వంటి శుష్క వాదములను తీవ్ర స్థాయిలో చేయుటవలన కేవలము వ్యర్ధముగా కంఠశోష తప్ప ఎంతమాత్రము ప్రయోజనము లేదు. అట్టి అనవసర వాదములు మనలను ఘోరమగు మరణమునుండి ఏమైనా రక్షించగలవా? అందువల్ల, ఓ బుధ్ధిమంతుడా! వాటి బదులు పరమశివుని పాదకమలములను పూజించుచూ పరమ సౌఖ్యములను పొందుము.

కొన్ని వివరణలు:
(1) శివానందలహరి అంతా సమయాభావమువలన పారాయణము చేసుకోవడము కుదరనప్పుడు, నిత్య పారాయణ కోసమని, 10 అతిముఖ్య శ్లోకములను భగవాన్ శ్రీ రమణ మహర్షి తెలిపారు. అలా భగవాన్ రమణులు ఎంపికచేసిన 10 శ్లోకములలో ఈ శ్లోకము ఒకటి.

Sunday 19 August 2012

Sivanandalahari-5

స్మృతౌ శాస్త్రే వైద్యే శకునకవితాగానఫణితౌ
పురాణే మన్త్రే వా స్తుతినటనహాస్యేష్వచతురః ।
కథం రాజ్ఞాం ప్రీతిర్భవతి మయి కోஉహం పశుపతే
పశుం మాం సర్వజ్ఞ ప్రథితకృపయా పాలయ విభో ।। (5)


స్మృతౌ = స్మ్రుతులయందు (మనుస్మ్రుతి మొ||)
శాస్త్రే = శాస్త్రములయందు
వైద్యే = వైద్యమునందు
శకున = శకున శాస్త్రమునందు
కవితా = కవిత్వమునందు 
గాన = సంగీతమునందు
ఫణితౌ =  వ్యాకరణమునందు
పురాణే = పురాణములయందు
మన్త్రే వా = లేదా (వేద) మంత్రములయందు
స్తుతి = స్తుతించుటయందు
నటన = నటనయందు
హాస్యేషు =  హాస్యమునందు
అచతురః = చతురత (నిపుణత) లేనివాడను
కథం మయి భవతి = నాకు ఏవిధముగా కలుగగలదు
రాజ్ఞాం ప్రీతిః = రాజులయొక్క ఆదరము
కః అహం = నేను ఎవరు?
పశుపతే = ఓ పశుపతీ, సర్వజీవులకు ప్రభువైనవాడా
పశుం మాం = నేను కేవలము అవివేకియైన పశువును (అయినప్పటికీ)
సర్వజ్ఞ = ఓ సర్వజ్ఞమూర్తీ
ప్రథిత కృపయా = జగద్విఖ్యాతమగు నీ కృపతో
పాలయ = నన్ను పాలించుము
విభో = ఓ విభో, అంతటనూ వ్యాపించియున్నవాడా

నేను స్మ్రుతులయందు, శాస్త్రములయందు, వైద్యమునందు, శకున శాస్త్రమునందు, కవిత్వ, సంగీత, వ్యాకరణములయందు, పురాణములయందు, వేద మంత్రములయందు, స్తుతి చేయుటయందు, నటన హాస్యాదులలో ఎందులోనూకూడా చాతుర్యము లేనివాడను. అట్టి నాకు నరులైన ప్రభువుల ఆదరము ఏవిధముగా కలుగుతుంది? ఓ పశుపతీ, అసలు నేను ఎవరు? నేను కేవలము అవివేకినైన పశువును. అయినప్పటికీ, ఓ సర్వజ్ఞమూర్తీ, నీ అపారమగు కృపతో నన్ను రక్షించుము విభో.

Saturday 18 August 2012

Sivanandalahari-4

సహస్రం వర్తన్తే జగతి విబుధాః క్షుద్రఫలదాః
న మన్యే స్వప్నే వా తదనుసరణం తత్కృతఫలమ్ |
హరి బ్రహ్మాదీనామపి నికటభాజామసులభం
చిరం యాచే శంభో శివ తవ పదాంభోజ భజనమ్ || (4)

సహస్రం వర్తన్తే = అసంఖ్యాకముగా ఉన్నారు
జగతి = ఈ జగత్తునందు
విబుధాః = దేవతలు
క్షుద్రఫలదాః = అల్పమైన ఫలములను ప్రసాదించువారు
న మన్యే = నేను పరిగణించను
స్వప్నే వా = (కనీసము) కలలోకూడా
తదనుసరణం = వారిని అనుసరిద్దామనిగానీ
తత్ కృత ఫలం = (లేదా) వారు ప్రసాదించగల ఫలముల గురించిగానీ
హరి బ్రహ్మాదీనాం అపి = హరి బ్రహ్మాదులవంటివారికి కూడా
నికటభాజాం = నీ సాన్నిధ్యమునందేయున్న
అసులభం = దుష్కర సాధ్యమైన
చిరం యాచే = నిరంతరమూ యాచించుచున్నాను
శంభో = ఓ శంభో, ఆనందమును కలిగించువాడా
శివ = ఓ శివా, పరమ మంగళస్వరూపా
తవ = నీ
పదాంభోజ భజనం = పాదకమలములయొక్క సేవను

ఓ శంభో, ఈ జగత్తునందు అల్పమైన ఫలములను ప్రసాదించు దేవతలు అసంఖ్యాకముగా ఉన్నారు. అట్టివారిని అనుసరిద్దామనిగానీ, లేదా వారు ప్రసాదించగల ఫలముల గురించిగానీ నేను కనీసము నా కలలోనైనా ఆలోచించను. ఓ పరమశివా, నీ సాన్నిధ్యమునందేయున్న హరి బ్రహ్మాదులవంటివారికి కూడా దుష్కర సాధ్యమైన నీ పాదకమలములయొక్క సేవాభాగ్యమును ప్రసాదించమని మాత్రమే నిన్ను నిరంతరమూ యాచించుచున్నాను.

Saturday 11 August 2012

Sivanandalahari-3

 త్రయీవేద్యం హృద్యం త్రిపురహరమాద్యం త్రినయనం
జటాభారోదారం చలదురగహారం మృగధరమ్ .
మహాదేవం దేవం మయి సదయభావం పశుపతిం
చిదాలమ్బం సామ్బం శివమతివిడమ్బం హృది భజే (3)

త్రయీవేద్యం = మూడు వేదములద్వారా  తెలుసుకొనబడువాడు
హృద్యం = హృదయమునకు ప్రియమైనవాడు
త్రిపురహరం = త్రిపురాంతకుడు
ఆద్యం = ఆద్యుడు
త్రినయనం = త్రినేత్రుడు
జటాభారోదారం = విస్తారమైన జటలు కలిగినవాడు
చలదురగహారం = చలించే పామును హారముగా అలంకరించుకున్నవాడు
మృగధరం = లేడిని చేబూనినవాడు
మహాదేవం = దేవాధిదేవుడు
దేవం = స్వయం ప్రకాశకుడు
మయి సదయభావం = నాయందు దయగలవాడు
పశుపతిం = సర్వజీవులకు ప్రభువైనవాడు
చిదాలమ్బం = జ్ఞానమునకు ఆధారమైనవాడు
సామ్బం = (ఎల్లప్పుడూ) అంబికతో కలిసియుండువాడు
శివం = సర్వ మంగళ ప్రదాత
అతివిడమ్బం = నటనలో (లేదా అనుకరించుటలో) అత్యద్భుతమైన ప్రజ్ఞ కలవాడు
హృది భజే = (అయినట్టి ఆ పరమేశ్వరుని) నా హృదయమునందు ధ్యానించుచున్నాను

మూడు వేదములద్వారా  తెలుసుకొనబడువాడు, హృదయమునకు ప్రియమైనవాడు, త్రిపురాంతకుడు, ఆద్యుడు, త్రినేత్రుడు, విస్తారమైన జటలు కలిగినవాడు, కదులుతూ ఉండే పామును హారముగా అలంకరించుకున్నవాడు, లేడిని చేబూనినవాడు, దేవాధిదేవుడు, స్వయం ప్రకాశకుడు, నాయందు దయగలవాడు, సర్వజీవులకు ప్రభువైనవాడు, జ్ఞానమునకు ఆధారమైనవాడు, ఎల్లప్పుడూ అంబికతో కలిసియుండువాడు, సర్వ మంగళ ప్రదాత, అనుకరించుటలో అత్యద్భుతమైన ప్రజ్ఞ కలవాడు అయినట్టి ఆ పరమేశ్వరుని నా హృదయమునందు ధ్యానించుచున్నాను.

కొన్ని వివరణలు:

(1) "త్రయీవేద్యం" అనే పదమునకు - "ప్రణవోపాసనమనెడి త్రయీవిద్యద్వారా తెలుసుకొనబడువాడు"అనే అర్ధముకుడా కలదు.

(2) "త్రిపురహరం" అనగా - జాగ్రత్, స్వప్న, సుషుప్తి అనెడి మూడు స్థితులను దాటించి తురీయ స్థితిని ప్రసాదించువాడు అని,  / లేదా సత్వ, రజో తమస్సు అనెడి త్రిగుణములను హరించి, సుద్ధసత్వస్థితిని ప్రసాదించువాడు అనికుడా అర్ధము కలదు.

త్రిపురములనగా స్థూల, సూక్ష్మ, కారణ శరీరములని అర్ధము. శివుడు మూడుసార్లు త్రిపురాసుర సంహారము గావించినట్లు చెప్పెదరు. మొదట శివానుగ్రహమువలన శారీరక రోగములు నశించి దేహశుద్ధి కావలయును. పిమ్మట కామక్రోధాదులు నశించి మానసశుద్ధి యగుట సూచింపబడినది. మూడవసారి కారణ శరీరమును ఆవరించిన తమస్సు నాశనము చేయబడుట వర్ణించబడినది. ఇదియే త్రిపురాసుర సంహార రహస్యము. (మూలము: బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణశాస్త్రి గారు ఉపన్యాసముల సంకలనము: "నాకు తోచిన మాట" గ్రంధములోని 6వ ఉపన్యాసములో ఇవ్వబడ్డ వివరణము.)

(3) "పశువు" అనగా "పాశములచే బంధింపబడినది" అనిట అర్ధము. కామము, క్రోధము మొదలైన అరిషడ్వర్గములను పాశములచే బంధింపబడి వుండుటచే, మనముకూడా పశువులుగానే పరిగణింపబడతాము అన్నదాంట్లో ఏమాత్రమూ సందేహములేదు! అట్టి సర్వ జీవులకు పరమేశ్వరుడు ప్రభువు కావడముచేత ఆయనను "పశుపతి" అని పిలుస్తారు.

(4) పై శ్లోకములో వర్ణించబడిన పరమశివుని రూపము మరియు ఆయన ధరించిన అలంకారములు తాత్వికమైన సంకేతాలు. ఉదాహరణకు: శివుని మూడవకన్ను జ్ఞాననేత్రము; అది తెరువబడినప్పుడు నానాత్వముతోకూడియున్న ఈ జగత్తు నశించి, దాని స్థానములో ఒక్కటే అయిన పరబ్రహ్మము దర్శనమిస్తుంది. అలానే, శివుడు ఒక చేతిలో లేడిని ధరించి ఉంటాడు; లేడి మన మనస్సునకు గల చంచలత్వమును చూచిస్తుంది (లేడి ఎప్పుడూ ఒకచోట స్థిరంగా ఉండక, అటూ ఇటూ గెంతుతూ ఉంటుంది, మన మనస్సులాగానే!); అలానే లేడిని మాయకు చిహ్నంగాకూడా చెబుతారు; తనను ధ్యానించినవారికి అలా మనస్సునకు గల చంచలత్వము/మాయ తొలగుతుంది అని చెప్పడానికి సంకేతంగా ఆయన చేతిలో లేడిని ధరించి ఉంటాడు. పై శ్లోకములో వర్ణించబడిన శివునియొక్క రూపాన్ని, ధరించిన ఆభరణాలనుగూర్చి శ్రధ్ధతో ధ్యానిస్తే వాటియొక్క నిజతత్వము మన మనస్సుకే జ్యోతకమవుతుందని పెద్దలు చెబుతారు.

Thursday 9 August 2012

Sivanandalahari-2

గలన్తీ శంభో త్వచ్చరిత సరితః కిల్బిషరజో
దలన్తీ ధీకుల్యాసరణిషు పతన్తీ విజయతామ్ |
దిశన్తీ సంసారభ్రమణ పరితాపోపశమనం
వసన్తీ మచ్చేతో హృదభువి శివానన్దలహరీ || (2)

గలన్తీ = ఏవైతే ప్రవహించుచున్నవో
శంభో = ఓ శంభో (ఆనందమును కలిగించువాడా)
త్వచ్చరిత సరితః = నీ సచ్చరిత్రము అనెడి నదినుండి
కిల్బిషరజః = పాపము అనెడి రజమును (దుమ్ము కణములను)
దలన్తీ = ఏవైతే పోగొట్టుచున్నవో
ధీకుల్యా సరణిషు = బుద్ధి అనెడి సరస్సునందు
పతన్తీ = ఏవైతే పడుచున్నదో
విజయతాం = అట్టివానికి జయమగుగాక
దిశన్తీ = ఏదైతే ఇచ్చుచున్నవో
సంసారభ్రమణ = సంసారమునందే చిక్కుకుని తిరుగుటవలన కలుగు
పరితాపోపశమనం = పరితాపమునుండి ఉపశమనమును.
వసన్తీ = ఏవైతే నివశించుచున్నవో
మచ్చేతః హృదభువి = నా హృదయమనెడి కుహరమునందు
శివానన్దలహరీ = పరమశివుని ఆనంద కెరటములు

ఓ శంభో, నీ సచ్చరిత్రము అనెడి నదినుండి ప్రవహించుచూ, పాపములనెడి రజస్సులను పోగొట్టుచూ, బుద్ధి అనెడి సరస్సులందు పడుచూ, నిరంతర సంసారభ్రమణముచే కలుగు తీవ్ర పరితాపమునుండి ఉపశమనమును కలిగించుచూ, నా హృదయమునందు ఉండునట్టి పరమశివుని ఆనంద కెరటములకు జయమగుగాక.

The above animated image is from: http://senderosdeiluminacion.bligoo.com/

Sunday 5 August 2012

Sivanandalahari-1


కలాభ్యాం చూడాలంకృత శశికలాభ్యాం నిజతపః
ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే |
శివాభ్యామస్తోక త్రిభువన శివాభ్యాం హృది పున
ర్భవాభ్యామానన్ద స్ఫురదనుభవాభ్యాం నతిరియమ్ || (1)

కలాభ్యాం = (సకల) కళలయొక్క స్వరూపము తామే అయిన వారు (అగు పార్వతీ పరమేశ్వరులు ఇరువురికీ)
చూడాలంకృత శశికలాభ్యాం = శిరస్సుపై చంద్రరేఖను అలంకరించుకున్నవారు
నిజతపః ఫలాభ్యాం = పరస్పరము ఒకరి తపస్సునకు మరియొకరు ఫలముగా లభించినవారు
భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం = భక్తులకు విశేషముగా వరములను ప్రసాదించువారు
శివాభ్యాం = పరమ మంగళ స్వరూపులు
అస్తోక త్రిభువన శివాభ్యాం = మూడు భువనములకును విశేషముగా శుభములను కలుగజేయువారు
హృది పునర్భవాభ్యాం = (నా) హృదయమునందు మరలా మరలా దర్శనమిచ్చువారు
ఆనన్ద స్ఫురదనుభవాభ్యాం = ఉప్పొంగుతున్న ఆనంద స్థితిని అనుభవించువారు (అయిన పార్వతీపరమేశ్వరులకు)
మే నతిరియమ్ = ఇవియే నా నమస్కారములు
భవతు = అగుగాక

సకల కళలయొక్క స్వరూపము తామే అయిన వారు, శిరస్సున చంద్రరేఖను ధరించినవారు, పరస్పరము ఒకరి తపస్సునకు మరియొకరు ఫలముగా లభించినవారు, భక్తులకు విశేషముగా వరములను ప్రసాదించువారు, పరమ మంగళ స్వరూపులు, త్రిభువనములకును విశేషముగా శుభములను కలుగజేయువారు, నా హృదయమునందు మరలా మరలా దర్శనమిచ్చువారు, నిరంతరమూ ఉప్పొంగుతున్న ఆనంద స్థితిని అనుభవించువారు అయిన పార్వతీ పరమేశ్వరులకు ఇవియే నా నమస్కారములగుగాక.

Sivanandalahari

 
గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః
గురుస్సాక్షాత్పరబ్రహ్మ తస్మైశ్రీ గురవేనమః 

ఆదిశంకరాచార్య విరచితమైన శివానందలహరిలోని శ్లోకములకు తెలుగులో ప్రతిపదార్ధములు మరియు తాత్పర్యములను ఈ బ్లాగులో వ్రాసుకోవాలని అభిలాష. ఈ సంకల్పమును సఫలము చేయమని త్రిమూర్త్యాత్మకుడు, సకలదేవతాస్వరూపుడు అయిన శ్రీ షిరిడీ సాయినాథుని వేడుకుంటున్నాను.

ఇచట తెలుగులో పొందుపరచబోయే ప్రతిపదార్ధ తాత్పర్యములకు ప్రధానమైన అధారము: శ్రీమతి డా|| ఉమా కృష్ణస్వామిగారు ఆంగ్లములో వ్రాసిన చక్కటి అనువాదము.  ఆ అనువాదమును ఈ క్రింది లింకు వద్ద చూడగలరు:

వారు వ్రాసిన అదే ఆంగ్ల అనువాదమును, శ్లోకములను మాత్రము తెలుగులిపిలో (with meanings in English only) ఈ క్రింది బ్లాగులో చదువుకొనగలరు: