Saturday, 1 November 2014

Sivanandalahari-49




ఆనన్దామృత పూరితా హరపదాంభోజాలవాలోద్యతా
స్థైర్యోపఘ్నముపేత్య భక్తి లతికా శాఖోపశాఖాన్వితా
ఉచ్ఛైర్మానస కాయమాన పటలీమాక్రమ్య నిష్కల్మషా
నిత్యాభీష్ట ఫలప్రదా భవతు మే సత్కర్మ సంవర్ధితా (49)


ఆనన్ద అమృత = ఆనందము అనెడి అమృతముతో
పూరితా = నింపబడి
హర పదాంభోజ = శివుని పాదపద్మములు అనెడి
ఆలవాల ఉద్యతా = పందిరి రాటపై (ప్రాకుడు కర్రపై) ఎగబ్రాకి
స్థైర్య ఉపఘ్నం ఉపేత్య = స్థైర్యము (అనెడి పందిరిపై గల కర్రల)ను ఆధారముగా చేసుకుని
భక్తి లతికా = భక్తి అనెడి లత
శాఖ ఉపశాఖ అన్వితా = చిలవలు పలవలను అల్లుకొనుచు
ఉచ్ఛైః మానస = ఉన్నతమైన మనస్సు అను
కాయమాన పటలీం = పందిళ్ళ సమూహమును
ఆక్రమ్య = ఆవరించుకొని
నిష్కల్మషా = (చీడ మొదలగు వానిచే) శిధిలముగాక
నిత్య అభీష్ట ఫల ప్రదా = శాశ్వతమైన కోర్కెను తీర్చున్నది (మోక్షము అను ఫలమును ఇచ్చునది)
భవతు మే = నాకు అగుగాక
సత్కర్మ సంవర్ధితా = పుణ్య కర్మలచే వృద్ధి పొందుచు

భక్తి అనెడి లత - ఆనందము అనెడి అమృతమయ జలములతో పోషింపబడిశివుని పాదపద్మములు అనెడి పందిరి రాటపైనుండి ఎగబ్రాకి,  స్థైర్యము అనెడి పందిరిపై గల కర్రలను ఆధారముగా చేసుకుని, చిలవలు పలవలను అల్లుకొనుచు, ఉన్నతమైన మనస్సు అను పందిళ్ళ సమూహమును ఆవరించుకొని, చీడ మొదలగు వానిచే శిధిలముగాక, పుణ్య కర్మలచే వృద్ధి పొందుచు, నా మనోభీష్టమగు శాశ్వతమైన మోక్షము అను ఫలమును ఇచ్చుగాక.

కొన్ని వివరణలు:

(1) ఈ శ్లోకమునందు "శివునిపై గల భక్తి వృద్ధి చెంది మోక్ష ఫలమును ఇచ్చుట" - "లత పెరిగి ఫలములనిచ్చుట" తో పోల్చబడినది. పాదునుండి బయలుదేరిన లత, నీటితో పోషింపడి, పందిరియొక్క రాటలను ఆధారంగా చేసుకుని పందిరిపైకి ఎగబ్రాకి, శాఖోపశాఖలుగా విస్తరించి, చీడ పీడల వలన శిధిలమవకుండా, వృద్ధిని పొందినప్పుడు, ఆ లత మధురమైన ఫలములను ఇస్తుంది; అదేవిధంగా "శివభక్తి" అనే లత, మనము ఏమి ఆచరిస్తే, "మోక్షము" అనే శాశ్వత ఫలాని మనకు ప్రసాదిస్తుందో ఈ శ్లోకంలో శ్రీ శంకరాచార్యులవారు వర్ణించారు.

Saturday, 25 October 2014

Sivanandalahari-48

నిత్యానన్ద రసాలయం సురముని స్వాన్తామ్బు జాతాశ్రయం
స్వచ్ఛం సద్విజ సేవితం కలుషహృత్ సద్వాసనావిష్కృతమ్ .
శంభుధ్యాన సరోవరం వ్రజ మనో హంసావతంస స్థిరం
కిం క్షుద్రాశ్రయ పల్వల భ్రమణ సంజాత శ్రమం ప్రాప్స్యసి (48)

నిత్య ఆనన్ద = శాశ్వతమైన ఆనందము
రస = (అనెడి) ఉదకమునకు (నీటికి)
ఆలయం = స్థానమైనది
సుర = దేవతలయొక్కయు
ముని = మునులయొక్కయు
స్వాన్త = హృదయములు అను
అమ్బుజాత = పద్మములకు
ఆశ్రయం = ఆశ్రయమైనది
స్వచ్ఛం = నిర్మలమైనది
సద్విజ = బ్రహ్మజ్ఞానమునకై తపించువారిచే
సేవితం = సేవింపబడునది
కలుష హృత్ = కల్మషములను హరించునది
సద్వాసనా = శుభ వాసనలను (సంస్కారములను)
ఆవిష్కృతమ్ = కలుగజేయునది(అయిన)
శంభు ధ్యాన = ఈశ్వరునియొక్క ధ్యానము (అనెడి)
సరోవరం = సరోవరమును
వ్రజ = పొందుము
మన హంస అవతంస = ఓ (నా) మనస్సు అనెడి హంసరాజమా
స్థిరం = స్థిరముగా.
కిం = ఎందులకు
క్షుద్రాశ్రయ = అల్పములైనవాటిని ఆశ్రయించి
పల్వల భ్రమణ = బురద గుంటలయందు తిరుగుటచే
సంజాత శ్రమం ప్రాప్స్యసి = జనించెడి శ్రమను పొందెదవు?

మనస్సు అనెడి ఓ హంసరాజమా! నీవు సుస్థిరమైన "ఈశ్వర ధ్యానము" అనెడి సరోవరమును పొందుము. "ఈశ్వర ధ్యానము" అను ఆ సరస్సు శాశ్వతమైన ఆనందమును నీరుగా కలిగియున్నది. దేవతలు మరియు మునుల యొక్క హృదయములు అనెడి పద్మములకు ఆశ్రయమైయున్నది. నిర్మలమైనది, బ్రహ్మజ్ఞానమునకై తపించుచున్నవారి దాహార్తిని తీర్చునది, మనలోని కలుషములను హరించునది, మంచి సంస్కారములను మనయందు ఆవిష్కరించునది అగు ఆ సరోవరమును స్థిరముగా పొందుము. ఓ మనసా! నీవు అట్టి సరస్సును పొందక, ఎందులకు అల్పములైన బురదగుంటలను ఆశ్రయించి అనవసర శ్రమను పడుచున్నావు?

కొన్ని వివరణలు:

(1) ఈ శ్లోకములో ఈశ్వర-ధ్యానము సరోవరముతో పోల్చబడినది. ఆ సరోవరములో ఏది నీరుగా యున్నదో, అందలి పద్మములు ఏమిటో, ఆ నీటిని ఎవరు త్రాగుచున్నారో, ఆ నీటి తత్వమేమిటో, ఆ నీరు త్రాగడంవలన ఏమి జరుగుతుందో ఈ శ్లోకంలో శ్రీ శంకరాచార్యులవారు బోధించారు.

(2) పైన తెలిపిన పోలికల సహాయంతో - ఈశ్వర-ధ్యానాన్ని అసలు సరోవరంతో ఎందుకు పోల్చారో అని అలోచిస్తే, అప్పుడు, ఈ శ్లోకంలో "బురద గుంటలను ఆశ్రయించి శ్రమపడుట" అని దేనిని గురించి చెబుతున్నారో మనకు అర్ధమువుతుంది!

Saturday, 18 October 2014

Sivanandalahari-47

శంభుధ్యాన వసన్త సంగిని హృదారామేఽఘజీర్ణచ్ఛదాః
స్రస్తా భక్తి లతాచ్ఛటా విలసితాః పుణ్యప్రవాల శ్రితాః .
దీప్యన్తే గుణకోరకా జపవచః పుష్పాణి సద్వాసనా
జ్ఞానానన్ద సుధామరన్ద లహరీ సంవిత్ ఫలాభ్యున్నతిః (47)


శంభు ధ్యాన = ఈశ్వర ధ్యానము (అనెడి)
వసన్త = వసంత ఋతువుతో
సంగిని = సంబంధము (సంగము) కలిగిన
హృద్ ఆరామే = హృదయము అనెడి ఉద్యానవనములో
అఘ జీర్ణ ఛదాః = పాపములు అనెడి పండుటాకులు
స్రస్తాః = రాలిపోవును
భక్తి లతా ఛటా = భక్తి అనెడి తీగల సమూహములు
విలసితాః = ఉదయించును
పుణ్య = (ఆ తీగలు) పుణ్యము అనెడి
ప్రవాల శ్రితాః = చిగురుటాకులను పొందును
దీప్యన్తే = ప్రకాశించును
గుణ కోరకాః = సద్గుణములు అనెడి మొగ్గలతో
జప వచః = జప-వచనములు అనెడి
పుష్పాణి = పూవులు
సత్ వాసనా = సద్గుణములు అనెడి సువాసనలతో
జ్ఞాన ఆనన్ద సుధా = జ్ఞానమువలన కలిగిన ఆనందము అనెడి అమృతము
మరన్ద లహరీ = (అనెడి) పుష్పరసములయొక్క తరంగములు
సంవిత్ ఫల అభ్యున్నతిః = బ్రహ్మజ్ఞానము అనెడి ఫలము వృద్ధిని పొందును

హృదయము అనెడి ఉద్యానవనము ఈశ్వర ధ్యానము అనెడి వసంత ఋతువుతో సంబంధమును పొందినపుడు - పాపములు అనెడు పండుటాకులు రాలిపోవును. భక్తి అనెడి తీగల సమూహములు వ్యాపించును. ఆ తీగలు పుణ్యము అనెడి చిగురుటాకులను పొందును. సద్గుణములు అనెడి మొగ్గలతో ప్రకాశించును. జప-వచనములు (స్థుతులు) అనెడి పూవులు పూయును. సద్గుణములు అనెడి సువాసనలతో నిండిపోవును. జ్ఞానానందము అనెడి అమృతమయ ఫలరసముల తరంగములు ఆ వనమంతా వ్యాపించును. ఆ తీగలకు కాసిన బ్రహ్మజ్ఞానము అనెడి ఫలము దినదినాభివృద్ధిని పొందును.


కొన్ని వివరణలు:

(1) వసంతకాలం వచ్చినప్పుడు - ఉద్యానవనములలోని చెట్లకు ఉన్న ఎండుటాకులన్నీ రాలిపోతాయి; కొత్త కొత్త తీగలు వస్తాయి; వాటికి కొత్త ఆకులు చిగురిస్తాయి; మొగ్గలు తొడుగుతాయి; పుష్పాలు వికసిస్తాయి; వనమంతా సువాసనలతో నిండిపోతుంది; పూవులన్నీ తేనెలతో నిండియుంటాయి. ఫలములన్నీ దినదినాభివృధ్ధిని పొందుతాయి. ఆలానే, మనస్సు అనే వనములోనికి, ఈశ్వర ధ్యానము అనే వసంతము ప్రవేశిస్తే ఏమి జరుగుతుందో ఈ పై శ్లోకములో శ్రీ శంకరాచార్యులవారు ఎంతో మధురంగా వర్ణించారు.

Monday, 6 October 2014

Sivanandalahari-46

ఆకీర్ణే నఖరాజికాన్తి విభవైరుద్యత్సుధా వైభవై
రాధౌతేపి చ పద్మరాగ లలితే హంసవ్రజైరాశ్రితే .
నిత్యం భక్తి వధూగణైశ్చ రహసి స్వేచ్ఛా విహారం కురు
స్థిత్వా మానస రాజహంస గిరిజానాథాంఘ్రి సౌధాన్తరే (46)


ఆకీర్ణే = వ్యాపించిన
నఖ రాజి = (కాలి) గోటి వరుసలయొక్క
కాన్తి విభవైః = కాంతుల అతిశయము,
ఉద్యత్ = పెల్లుబుకుచున్న
సుధా వైభవైః = చంద్రునియొక్క అమృత కిరణములచే
ఆధౌతే = శుభ్రపడినదియు,
అపిచ = మరియు
పద్మరాగ లలితే =  పద్మములయొక్క ఎరుపువంటి రంగుతో ఒప్పారుచున్నది,
హంస వ్రజైః = పరమహంసల సమూహములచేత
ఆశ్రితే = ఆశ్రయింపబడినది,
నిత్యం = ఎల్లప్పుడును
భక్తి వధూ గణైః చ = భక్తి అనెడి భార్యలతో కూడి
రహసి = రహస్యముగా
స్వేచ్ఛా విహారం కురు = స్వేచ్ఛగా విహారము చేయుము
స్థిత్వా = నివసించి
మానస రాజహంస = ఓ మనస్సు అనెడి రాజహంసా!
గిరిజా నాథాంఘ్రి = గిరిజానాథుని పాదపద్మములనెడి
సౌధాన్తరే = సౌధము (భవనము) లో

గిరిజానాథుని పాదపద్మములనెడి సౌధము - ఈశ్వరుని కాలి గోటి వరుసలయొక్క కాంతుల అతిశయముతో వ్యాపించియున్నది; శివుని శిరస్సున ఉన్న చంద్రునినుండి స్రవించుచున్న అమృతమయ కిరణములతో ప్రకాశించున్నది; ఈశ్వరుని పాదములనుండి వెలువడుచున్న 'పద్మములయొక్క ఎరుపును పోలిన' రంగుతో ఒప్పారుచున్నది; మహాయోగులైన పరమహంసల సమూహములచేత ఆశ్రయింపబడుచున్నది. అట్టి ఆ సౌధాంతరాళమునందు, ఓ మనస్సు అనెడి రాజహంసా!, నీవు ఎల్లప్పుడును భక్తి అనెడి భార్యలతో కూడి, అచట నివసించుచు, రహస్యముగా, స్వేచ్ఛగా విహారము చేయుము.


Tuesday, 22 July 2014

Sivanandalahari-45

ఛన్దశాఖి శిఖాన్వితైః ద్విజవరైస్సంసేవితే శాశ్వతే
సౌఖ్యాపాదిని ఖేదభేదిని సుధాసారైః ఫలైర్దీపితే .
చేతః పక్షిశిఖామణే త్యజ వృథా సంచారమన్యైరలం
నిత్యం శంకర పాదపద్మ యుగలీ నీడే విహారం కురు (45)

ఛన్ద శాఖి = వేదములు కొమ్మలుగాను
శిఖా అన్వితైః = (ఉపనిషత్తులు) ఆ కొమ్మల చివరలుగా కలిగినది
ద్విజవరైః = బ్రాహ్మణ శ్రేష్ఠులచే (లేదా పక్షి శ్రేష్ఠములచేతను)
సంసేవితే = విశేషముగా సేవింపబడునది
శాశ్వతే = శాశ్వతమైనది
సౌఖ్య ఆపాదిని = సౌఖ్యమును కలిగించునది
ఖేద భేదిని = దుఃఖ నాశనము చేయునది
సుధా సారైః ఫలైః = అమృతమే రసముగా కలిగిన ఫలములతో
దీపితే = ప్రకాశించుచున్నది
చేతః పక్షి శిఖా మణే = ఓ మనస్సు అనెడి పక్షి రాజమా
త్యజ వృథా సంచారం = అనవసరమైన సంచారమును విడువుము
అన్యైః అలం = ఇతరములు ఇక చాలును
నిత్యం = ఎల్లప్పుడూ
శంకర పాదపద్మ యుగలీ నీడే = శంకరుని పాదపద్మద్వంద్వము అను గూటియందు
విహారం కురు = విహరించుము

మనస్సు అనెడి ఓ పక్షిరాజమా! వృధా సంచారములను విడిచిపెట్టుము. ఆ తిరుగుళ్ళు ఇక చాలును. శంకరుని పాదపద్మములనెడి గూటియందు, వేదములు ఆ వృక్షముయొక్క కొమ్మలుగాను, ఉపనిషత్తులు కొమ్మల చివరలుగాను కలిగియుండి, బ్రాహ్మణ శ్రేష్ఠులచే విశేషముగా సేవింపబడుచున్నది, శాశ్వతమైనది, సౌఖ్యమును కలిగించునది, దుఃఖమును నశింపజేయునది, అమృతమే రసముగా కలిగిన ఫలములతో ప్రకాశించునది అగు ఆ వృక్షముపై హాయిగా విహరించుము.


కొన్ని వివరణలు:

(1) పక్షి అన్ని చోట్లకు ఎలా తిరుగుతుందో, మనస్సుకూడా అలానే అన్ని చోట్లకు తిరిగివస్తూ ఉంటుంది. అందువలన, ఈ శ్లోకమునందు మన మనస్సు బాగా తిరుగుబోతు అయిన పక్షితో పోల్చబడినది.

(2) పై శ్లోకములో "ద్విజ" అనగా "రెండు జన్మలు కలిగినది" అని అర్ధము. ఈ పదము, పక్షికిని మరియు బ్రాహ్మణునకుకూడా అన్వయమగును. పక్షి, మొదట గ్రుడ్డుగా ఉండి, ఆ తరువాత పిల్లగా దానినుండి బయటకు వచ్చును; కావున అది రెండు జన్మలు కలిగినదిగా భావింపబడును. అలానే, బ్రాహ్మణుడు (= బ్రహ్మ జ్ఞానమును పొందుటకై యత్నించువాడు) ఉపనయన సంస్కారముతో రెండవ జన్మ పొందినవాడిగా పరిగణింపబడును.

Sunday, 20 July 2014

Sivanandalahari-44



కరలగ్నమృగః కరీన్ద్ర భంగో
ఘనశార్దూల విఖణ్డనోఽస్త జన్తుః .
గిరిశో విశదాకృతిశ్చ చేతః కుహరే
పంచముఖోస్తి మే కుతో భీః (44)

కర లగ్న మృగః = లేడిని (మాయను) చేజిక్కించుకున్నవాడు
కరీన్ద్ర భంగః = గజాసురునికి భంగపాటును (ఓటమిని) కలిగించినవాడు
ఘన శార్దూల విఖణ్డనః = ప్రబలుడైన వ్యాఘ్రాసురుని ఖండిచినవాడు
అస్త జన్తుః = ప్రాణకోటినంతటిని తనయందు లయము చేసుకొనువాడు
గిరిశః = కొండగుహయందు (హృదయమునందు) శయనించువాడు
విశద ఆకృతిః చ = మరియు తేజోస్వరూపము కలవాడు (అయిన పరమేశ్వరుడు)
చేతః కుహరే = నా మనస్సు అనెడి గుహయందు
పంచ ముఖః అస్తి = ఐదు ముఖములవాడు (శివుడు) ఉండగా
మే కతో భీః = నా దరికి భయము ఎక్కడనుండి రాగలదు?

లేడిని తన చేజింక్కించుకున్నవాడు, గజాసురునికి భంగపాటును కలిగించినవాడు, ప్రబలుడైన వ్యాఘ్రాసురుని ఖండించినవాడు, ప్రాణికోటినంతటినీ తనయందు లయము చేసుకొనువాడు, హృదయ కుహరమునందు శయనించువాడు, మరియు మహా తేజోస్వరూపుడు అయిన ఆ పంచముఖుడు (ఈశ్వరుడు), నా మనస్సు అనెడి గుహయందు ఉండగా ఇక నా దరికి భయము అనునది ఎక్కడనుండి రాగలదు?


కొన్ని వివరణలు:

(1) "హృదయమనెడి గుహయందు" నివసించు ఈశ్వరునిగూర్చి వర్ణించుటకు ప్రయోగించిన విశేషణములు, "అరణ్య గుహలలో" నివసించు సింహమునకుకూడా వర్తించేటట్లు, ఈ శ్లోకములో చాలా చమత్కారమైన రచన చేసారు శ్రీ శంకరాచార్యులవారు. అరణ్యమునకు సింహము ఎలానో, సకల భువనములకు శివుడు అలానే కాబట్టి, రెండింటికీ వర్తించేటట్లుగా విశేషణములను వాడడం ఎంతగానో తగియున్నది!

సింహమునకు ఆ విశేషణములు ఎలా వర్తిస్తాయో ఇప్పుడు చూద్దాము:

కర లగ్న మృగః = మృగములను తన పంజాయందు చిక్కించుకొనునది
కరీన్ద్ర భంగః = ఏనుగును చంపునది
ఘన శార్దూల విఖణ్డనః = బలమైన పులినికూడా దునుమాడునది
అస్త జన్తుః = తనను చూచినంతనే జంతువులన్నియు పారిపోయి మాయమగునట్లు చేయునది
గిరిశః = కొండ గుహలయందు నివసించునది
విశద ఆకృతిః చ = మరియు ప్రచండమైన ఆకృతి కలది
పంచ ముఖః అస్తి = బాగుగా తెరువబడిన నోరుకలది

(2) శివుడు పంచముఖుడు - ఆయన ఐదు ముఖములు (లేదా మూర్తుల) పేర్లు - (i) సద్యోజాత, (ii) వామదేవ, (iii) అఘోర, (iv) తత్పురుష మరియు (v) ఈశాన. తాత్వికముగా, ఈశ్వరుని ఐదు ముఖములు ఆయన నిర్వర్తించు (i) సృష్టి, (ii) స్థితి, (iii) లయము, (iv) తిరోధానము (అనగా దుష్టత్వమును నిగ్రహించుట), మరియు (v) అనుగ్రహములకు సంకేతములు.

Monday, 14 July 2014

Sivanandalahari-43

మా గచ్ఛ త్వమితస్తతో గిరిశ భో మయ్యేవ వాసం కురు
స్వామిన్నాదికిరాత మామకమనః కాన్తార సీమాన్తరే .
వర్తన్తే బహుశో మృగా మదజుషో మాత్సర్య మోహాదయ
స్తాన్ హత్వా మృగయా వినోద రుచితా లాభం చ సంప్రాప్స్యసి (43)

మా గచ్ఛ త్వం = నీవు వెళ్ళవద్దు
ఇతః తతః = అటు-ఇటు
గిరిశ భో = ఓ కైలాసవాసా
మయి ఏవ = నాయందే
వాసం కురు = నివాసము ఉండుము
స్వామిన్ = ఓ స్వామీ
ఆది కిరాత = ఓ ఆది కిరాతమూర్తీ (మొట్టమొదటి బోయవాడా!)
మామక మనః = నా మనస్సు (అనెడి)
కాన్తార సీమాన్తరే = అరణ్యము లోపల
వర్తన్తే = తిరుగుచున్నవి
బహుశో మృగాః = అనేక మృగములు
మదజుషః = మదించిన
మాత్సర్య మోహాదయః = మాత్సర్యము (అసూయ), మోహము మొదలగునవి
తాన్ హత్వా = వాటిని సంహరించి
మృగయా వినోద రుచితా = వేటడుట అనెడి వినోదములోగల రుచిని (మజా!)
లాభం చ సంప్రాప్స్యసి = ఆనందమును పొందగలవు

ఓ కైలాశవాసా, నీవు అటు ఇటు వెళ్ళక, కేవలము నాలోనే నివసించుము. ఓ ఆది కిరాతమూర్తి! నా మనస్సు అనెడి ఘోరారణ్యములోపల మోహము, మాత్సర్యము ఇత్యాది క్రూర మృగములు అనేకములు మదించి తిరుగుచున్నవి. వాటిని నీవు వేటాడి, వేటయందు నీకుగల కోర్కెను తీర్చుకుని ఆనందమును పొందుము!

కొన్ని వివరణలు:

ఈ శ్లోకమునందు, శ్రీ శంకరాచార్యులవారు, పరమశివుని "ఓ ఆది కిరాతమూర్తీ!" అని సందర్భోచితముగా సంభోదించారు. మనస్సులోని మోహము, మాత్సర్యము ఇత్యాది క్రూరమృగములను వేటాడుమని కోరునపుడు, ఈశ్వరునికి తనయొక్క కిరాత (బోయవాని) స్వరూపమును గుర్తుచేస్తున్నారు. అయితే ఈశ్వరుడు బోయవాని రూపమును ధరించినట్లు ఎక్కడ చెప్పబడినది?

(i) రుద్రాధ్యాయము నాలుగవ అనువాకమునందు, "నమో మృగయుభ్యః శ్వనిభ్యశ్చవో నమో" - అనగా - "మృగములను చంపే వేటగాడివైన మీకు నమస్కారము, కుక్కల మెడలయందు కట్టబడిన తాళ్ళను చేతితో పట్టుకునియున్న మీకు నమస్కారము" అని రుద్రునియొక్క కిరాత-రూపము వర్ణించబడినది.
http://namakam-telugu.blogspot.com/2012/05/anuvakam-4.html

(ii) ఆర్జునుడు పాశుపతాస్త్రమును పొందుటకై పరమేశ్వరునిగూర్చి తపస్సు చేయగా, ఈశ్వరుడు బోయవాని రూపములో వచ్చి, అర్జునుని పరీక్షించి, పాశుపతాస్త్రాన్ని ప్రసాదించాడు (భారవి విరచిత కిరాతార్జునీయం).

(iii) ఈ శ్లోకములో వివరించినట్లు, ఈశ్వరుడు అనాదిగా భక్తుల హృదయములయందలి దుష్ట సంస్కారములనే క్రూర మృగములను వేటాడి సంహరించుచున్నాడు కావున, అయనను "ఆది కిరాతకమూర్తీ" అని పిలుచుకొనడము సహజమే కదా!

Wednesday, 9 July 2014

Sivanandalahari-42

గాంభీర్యం పరిఖాపదం ఘనధృతిః ప్రాకార ఉద్యద్గుణ
స్తోమశ్చాప్తబలం ఘనేన్ద్రియచయో ద్వారాణి దేహే స్థితః
విద్యా వస్తు సమృధ్దిరిత్యఖిల సామగ్రీ సమేతే సదా
దుర్గాతిప్రియ దేవ మామక మనో దుర్గే నివాసం కురు (42)

గాంభీర్యం = గంబీరమైన భావము
పరిఖాపదం = కందకము (అగడ్త) గాను
ఘనధృతిః = విశేషమైన ధైర్యము
ప్రాకార = (కోటయొక్క) ప్రాకారములుగాను
ఉద్యద్గుణ స్తోమః చ = మరియు వికసించుచున్న సద్గుణముల సమూహము
ఆప్త బలం = నమ్మకమైన బలముగాను
ఘన ఇన్ద్రియ చయః = కన్ను ఇత్యాది ఇంద్రియములు
ద్వారాణి = (కోటయొక్క) ద్వారములుగాను
దేహే స్థితః = దేహమున ఉన్నట్టి
విద్యా = ఈశ్వరుని గురించిన జ్ఞానము
వస్తు సమృధ్ది = పదార్ధ సంపత్తిగను
ఇతి = ఈవిధముగా
అఖిల సామగ్రీ సమేతే = సకల వస్తువులతో సమగ్రముగానున్న
సదా = ఎల్లప్పుడు
దుర్గాతి ప్రియ దేవ = దుర్గములయందు (లేదా దుర్గాదేవియందు) మిగుల ప్రీతి కలిగిన ఓ దేవా
మామక మన దుర్గే = నా మనస్సు అనెడి దుర్గమందు
నివాసం కురు = (దయతో) నీవు నివశించుము

ఓ దుర్గాతిప్రియ దేవా! నా మనస్సు దుర్గమమైన కోటయొక్క లక్షణములన్నింటినీ కలిగియున్నది. గాంబీర్యమే కందకముగాను, విశేషమైన ధైర్యము ప్రాకారములుగాను, మరియు వికసించుచున్న సద్గుణాల రాసియే విశ్వసనీయమైన సైన్యముగాను, కన్నులు ఇత్యాది ఇంద్రియములు ద్వారములుగాను, ఈశ్వర జ్ఞానమే పదార్ధ సంపదగను, ఈవిధముగా సకల వస్తువులతో సమగ్రముగాయున్నట్టి నా మనస్సు అనెడి కోటయందు నీవు దయతో సదా నివశించుము. 

కొన్ని వివరణలు: 
(1) "దుర్గాతి ప్రియ దేవ" అనుదానికి బహు అర్ధములు కలవు;
  (a) "దుర్గాదేవియందు అత్యంత ప్రీతి కలిగిన ఓ దేవా" అని ఒక అర్ధము.
  (b) "దుర్గాదేవికి అత్యంత ప్రియుడవైన ఓ దేవా" అని ఇంకొక అర్ధము. 
  (c) "పరులకు ప్రవేశించ శక్యముకాని (దుర్గమ) ప్రదేశములలో (కోటలలో) నివశించుటయందు అత్యంత ప్రీతికలిగిన ఓ దేవా" - అనగా - "భక్తులయొక్క హృదయములనెడి కోటలలో నివశించుటయందు అత్యంత ప్రీతినిజూపు ఓ దేవా" అని అర్ధము.

Thursday, 3 July 2014

Sivanandalahari-41

 పాపోత్పాత విమోచనాయరుచిరైశ్వర్యాయ మృత్యుంజయ
స్తోత్ర ధ్యాన నతి ప్రదక్షిణ సపర్యాలోకనాకర్ణనే
జిహ్వా చిత్త శిరోఙ్ఘ్రి హస్త నయన శ్రోత్రైరహం ప్రార్థితో
మామాజ్ఞాపయ తన్నిరూపయ ముహుర్మామేవ మా మేవచః (41)

పాప ఉత్పాత = పాపములవలన సంభవించు విపత్తులనుండి
విమోచనాయ = విమోచనము పొందుటకు
రుచిః ఐశ్వర్యాయ = విశేషమైన ఐశ్వర్యములను పొందుటకు
మృత్యుంజయ = ఓ మృత్యుంజయా!
స్తోత్ర = (నీ) స్తుతులను
ధ్యాన = (నీ) ధ్యానమును
నతి = (నీకు) ప్రణమిల్లుట
ప్రదక్షిణ = ప్రదక్షిణలను
సపర్యా = (నీ) సేవను
ఆలోకన = (నీ రూపమును) వీక్షించుట
ఆకర్ణనే = (నీ లీలా) శ్రవణము (అనెడి కార్యములను)
జిహ్వా = (నా) జిహ్వతోను
చిత్త = మనస్సుతోను
శిర = శిరస్సుతోను
అంఘ్రి = పాదములతోను
హస్త = కరములతోను
నయన = నయనములతోను
శ్రోత్రైః = చెవులతోను (ఆచరించునట్లు)
అహం = నేను
ప్రార్థితః = ప్రార్ధింపబడినవాడినైతిని
మాం = నన్ను
ఆజ్ఞాపయ = (అట్లు చేయమని) ఆజ్ఞాపింపుము
తత్ = స్తుతించుట మొదలగువానిని ఆచరించుటకు
నిరూపయ = తగు ప్రేరణ కలిగించుము
ముహుః = మాటిమాటికిని
మామ్ = నాయెడల
ఏవ మా మే అవచః = ఈ విధముగా మౌనమును వహించకుము

ఓ మృత్యుంజయా! పాపముయొక్క ఉత్పాతములనుండి విమోచనమును పొందుటకును, మరియు మహదైశ్వర్య ప్రాప్తి కొరకును, నిన్ను స్తుతింపుమని నా నాలుకయు, నిన్ను ధ్యానింపుమని నా మనస్సు, నీకు ప్రణమిల్లుమని నా శిరస్సు, నీకు ప్రదక్షిణలు చేయుమని నా పాదములు, నీకు సపర్యలు చేయుమని నా శరీరము, నీ దివ్యమంగళ రూపమును వీక్షించుమని నా కన్నులు, మరియు నీ లీలా శ్రవణమును చేయుమని నా చెవులు నన్ను కోరుచున్నవి. అట్లు చేయుమని నన్ను ఆజ్ఞాపించి, వాటిని ఆచరించుటకు వలసిన ప్రేరణను నాకు ప్రసాదించుము. అంతేగాని, మాటిమాటికిని నా యెడల ఈ విధముగా మౌనమును వహింపకుము.

Monday, 22 October 2012

Sivanandalahari-40

ధీయన్త్రేణ వచోఘటేన కవితా కుల్యోపకుల్యాక్రమై
రానీతైశ్చ సదాశివస్య చరితామ్భోరాశి దివ్యామృతైః
హృత్కేదారయుతాశ్చ భక్తికలమాః సాఫల్యమాతన్వతే
దుర్భిక్షాన్మమ సేవకస్య భగవన్ విశ్వేశ భీతిః కుతః (40)

ధీ యన్త్రేణ = బుద్ధి అనెడి యంత్రముతో
వచో ఘటేన = వాక్కు అనెడి కుండలతో
కవితా = కవిత్వము అనెడి
కుల్యోపకుల్యాక్రమైః = కాలువలు పిల్లకాలువలద్వారా
ఆనీతైః చ = తీసుకురాబడిన
సదాశివస్య = సదాశివునియొక్క
చరిత = చరితము అనెడి
అమ్భో రాశి దివ్య అమృతైః = దివ్యామృత జల రాశులు
హృత్కేదార = హృదయము అనెడి పంటభూమితో
యుతాః చ = కలిసినప్పుడు
భక్తి కలమాః = భక్తి అనెడి పంట
సాఫల్యమ్ ఆతన్వతే = సాఫల్యమును పొందుతుంది
దుర్భిక్షాత్ = దుర్భిక్షమువలన
మమ = నాకు
సేవకస్య = (నీ) సేవకునకు
భగవన్ = హే భగవాన్
విశ్వేశ = హే జగత్ప్రభో
భీతిః కుతః = భయము ఎక్కడ ఉన్నది?

బుద్ధి అనెడి యంత్రముతో, వాక్కు అనెడి కుండలతో, కవిత్వము అనెడి కాలువలు పిల్లకాలువలద్వారా తీసుకురాబడిన సదాశివునియొక్క చరితము అనెడి దివ్యామృత జల రాశులు, హృదయము అనెడి పంటభూమితో కలిసినప్పుడు, హృదయమునందలి భక్తి అనెడి పంట సాఫల్యమును పొందుతుంది. హే భగవాన్, హే జగత్ప్రభో, నీ సేవకుడనగు నాకు ఇక దుర్భిక్షమువలన భయము ఎక్కడ ఉన్నది?

కొన్ని వివరణలు:

(1) పంట పొలాలకు నీరు పెట్టడానికి ఉపయోగించే ఒక విధానములో, ఒక యంత్రానికి బానను (బకెట్) ఒకదానిని అమరుస్తారు. ఆ యంత్రాన్ని త్రిప్పినప్పుడు, పెద్దకాలువలలోనుండి నీరు, ఈ బానద్వారా చేనుకు దగ్గరగా తీసుకుని రాబడుతుంది. దీనిని "ఏతము" అని అంటారు. ఆక్కడినుండి ఆ నీరు పిల్లకాలువలద్వారా పంట పొలాలలోకి మళ్ళింపబడుతుంది. దీనిని ఉపమానముగా తీసుకుని, భక్తుని హృదయము అనే పంటభూమిలోనికి భగవంతుని చరితామృతము అనెడి దివ్య జలాలను ఎలా తీసుకు రావాలో, అలా తీసుకు రాబడిన జలాలు ఆ భూమిలోని భక్తి అనెడి పంటతో కలిసినపుడు ఏమి జరుగుతుందో ఈ శ్లోకములో హృద్యముగా వివరించారు.

Saturday, 20 October 2012

Sivanandalahari-39

ధర్మో మే చతురంఘ్రికస్సుచరితః పాపం వినాశం గతం
కామ క్రోధ మదాదయో విగలితాః కాలాః సుఖావిష్కృతాః
జ్ఞానానన్ద మహౌషధిః సుఫలితా కైవల్యనాథే సదా
మాన్యే మానసపుణ్డరీక నగరే రాజావతంసే స్థితే (39)

ధర్మః మే = నేను ఆచరించు ధర్మము
చతురంఘ్రికః = నాలుగు పాదములమీద (1.సత్యము, 2.దానము, 3.తపస్సు, 4.దయ)
సు చరితః = చక్కగా నడుస్తుంది
పాపం వినాశం గతం = పూర్వ పాపములన్నీ నశిస్తాయి
కామ క్రోధ మదాదయః  = కామ క్రోధాది అరిషడ్వర్గములు
విగలితాః = అంతమొందుతాయి
కాలాః = సర్వ కాలములు
సుఖ ఆవిష్కృతాః = సుఖమును కలుగజేస్తాయి
జ్ఞానానన్ద మహౌషధిః  = జ్ఞానము, ఆనందము అనెడి దివ్యౌషధములు
సుఫలితా = సత్ఫలితములను ఇస్తాయి
కైవల్యనాథే = కైవల్యనాథుడగు పరమశివుడు
సదా =ఎల్లప్పుడూ
మాన్యే = పూజింపబడుతూ
మానస పుణ్డరీక నగరే = హృదయ కమలమనెడి నగరమునందు
రాజ అవతంసే = రాజులందరిలోకి కలికితురాయి
స్థితే = నివశించుచున్నప్పుడు

రాజులందరిలోకి కలికితురాయి, కైవల్యనాథుడు అయిన పరమశివుడు, నాచే ఎల్లప్పుడూ పూజింపబడుతూ, నా హృదయ కమలమనెడి నగరమునందు నివశించుచున్నప్పుడు, నేను ఆచరించు ధర్మము నాలుగు పాదములమీద చక్కగా నడుస్తుంది. పూర్వ పాపములన్నీ నశిస్తాయి. కామ క్రోధాది అరిషడ్వర్గములన్నీ అంతమొందుతాయి. సర్వ కాలములు సుఖమును కలుగజేస్తాయి. జ్ఞానము, ఆనందము అనెడి దివ్యౌషధములు సత్ఫలితములను ఇస్తాయి.

Friday, 19 October 2012

Sivanandalahari-38

ప్రాక్పుణ్యాచల మార్గదర్శిత సుధామూర్తిః ప్రసన్నశ్శివః
సోమస్సద్గుణ సేవితో మృగధరః పూర్ణస్తమో మోచకః
చేతః పుష్కర లక్షితో భవతి చేదానన్దపాథో నిధిః
ప్రాగల్భ్యేన విజృంభతే సుమనసాం వృత్తిస్తదా జాయతే (38)

ప్రాక్ పుణ్య అచల = పూర్వ పుణ్యము అనెడి రాశి (వలన)
మార్గ దర్శిత = చూడబడువాడు
సుధా మూర్తిః = మూర్తీభవించిన అమృతత్వము
ప్రసన్న = ప్రసన్నుడు
శివః  = పరమశివుడు
సోమః = ఉమాసమేతుడు (స + ఉమః)
సద్గుణ సేవితః = సద్గుణ సేవితుడు
మృగధరః = లేడిని చేత ధరించినవాడు (మాయకు చిహ్నము)
పూర్ణః = పూర్ణుడు
తమో మోచకః = అజ్ఞానమునుండి విమోచనము కలిగించువాడు
చేతః పుష్కరః = మనో మండలములో
లక్షితో భవతి చేత్ = చూడబడినచో
ఆనన్ద పాథో నిధిః = ఆనందమనే సాగరము
ప్రాగల్భ్యేన విజృంభతే = ఉప్పొంగి పొరలుతుంది
సుమనసాం = మంచి మనస్సు కలవారి
వృత్తిః తదా = (మనో) వృత్తులు అప్పుడు
జాయతే = (ఆ ఆనంద సాగరమునందే) లీనమవుతాయి

పురాకృత పుణ్యరాశి ఫలితముగా చూడబడువాడు, అమృత మూర్తి, ప్రసన్నుడు, ఉమాసమేతుడు, సద్గుణ సేవితుడు, మృగధరుడు, పూర్ణుడు, అజ్ఞానమును నశింపజేయువాడగు ఆ పరమశివుని మన మనో మండలమునందు దర్శించినట్లయితే, మనలో ఆనంద సాగరము ఉప్పొంగి పొరలుతుంది. అప్పుడు, మంచి మనస్సు కలవారి మనోవృత్తులన్నీ ఆ ఆనంద సాగరమునందే లీనమవుతాయి.

ఈ శ్లోకమునకు రెండు అర్ధములు కలవు. మొదటి అర్ధం మనం పైన వివరించుకున్నట్లు పరమేశ్వరుని పరంగా కలదు. ఇక రెండవ అర్ధం - ఇదే శ్లోకం యధాతథంగా చంద్రునికి కూడా అన్వయమవుతుంది. ఎలాగో ఇప్పుడు చూద్దాము:

ప్రాక్ పుణ్య అచల = తూర్పున ఉన్న పవిత్రమైన ఉదయగిరిన
మార్గ దర్శిత = చూడబడువాడు
సుధా మూర్తిః = తెల్లని రూపము కలిగినవాడు
ప్రసన్న = అహ్లాదమును కలిగించువాడు
శివః  = మంగళకరుడు
సోమః = చంద్రుడు
సద్గుణ సేవితః = నక్షత్రముల మధ్యన ఉన్నవాడు
మృగధరః = లేడిని పోలిన రూపమును (మచ్చను) ధరించినవాడు
పూర్ణః = పూర్ణుడు (16 కళలు కలవాడు)
తమో మోచకః = చీకటిని తొలగించువాడు
చేతః పుష్కరః = మనో మండలము
లక్షితో భవతి చేత్ = చూడబడినచో
ఆనన్ద = ఆనందముతో
పాథో నిధిః = సాగర జలములు
ప్రాగల్భ్యేన విజృంభతే =  ఉప్పొంగి పొరలుతాయి
సుమనసాం = సువాసనలను వెదజల్లు పుష్పములు
వృత్తిః తదా జాయతే = అప్పుడు చక్కగా వికసిస్తాయి

తూర్పున ఉన్న పవిత్రమైన ఉదయగిరిన చూడబడువాడు, తెల్లని రూపము కలిగినవాడు, అహ్లాదమును కలిగించువాడు, మంగళకరుడు, నక్షత్రముల మధ్యన ఉన్నవాడు, లేడి రూపమును ధరించినవాడు, షోడశ కళా పూర్ణుడు, చీకటిని తొలగించువాడగు చంద్రుని దర్శించినప్పుడు, సాగర జలములు ఆనందముతో ఉప్పొంగి పొరలుతాయి. సువాసనలను వెదజల్లు పుష్పములు చక్కగా వికసిస్తాయి.

Tuesday, 16 October 2012

Sivanandalahari-37

ఆమ్నాయాంబుధిమాదరేణ సుమనస్సంఘాస్సముద్యన్మనో
మన్థానం దృఢభక్తి రజ్జు సహితం కృత్వా మథిత్వా తతః
సోమం కల్పతరుం సుపర్వ సురభిం చిన్తామణిం ధీమతాం
నిత్యానన్ద సుధాం నిరన్తరరమా సౌభాగ్యమాతన్వతే (37)

ఆమ్నాయ అంబుధిం = వేదములు అనే సముద్రమును
ఆదరేణ = ఆదరముతో
సుమనః సంఘః = సత్పురుషుల సమూహము
సముద్యన్ మనః = శ్రద్దకలిగిన మనస్సును
మన్థానం = కవ్వముగా
దృఢ భక్తి = దృఢ భక్తిని
రజ్జు సహితం = త్రాడుగా
కృత్వా = చేసుకుని
మథిత్వా తతః = మథనము చేయగా, అప్పుడు
సోమం = ఉమాసమేతుడు
కల్పతరుం = కల్పవృక్షము
సుపర్వ సురభిం = కామధేనువు
చిన్తామణిం = చింతామణి
ధీమతాం = ధీమంతులు
నిత్యానన్ద సుధాం = నిత్యానందము అనే అమృతమును
నిరన్తర రమా = నిరంతర ఐశ్వర్యమును (ముక్తి)
సౌభాగ్యం = సౌభాగ్యము
ఆతన్వతే = పొందెదరు

సత్పురుషుల సమూహము, శ్రద్దకలిగిన మనస్సును కవ్వముగా చేసుకుని, దృఢ భక్తిని త్రాడుగా చేసుకుని, వేదములు అనే సముద్రమును ఆదరముతో మథనము చేయగా, అప్పుడు ఆ ధీమంతులు, ఉమాసమేతుడగు పరమేశ్వరుడిని, కల్పవృక్షము, కామధేనువు, చింతామణులవలె కోర్కెలను ఈడేర్చువానిని, నిత్యానందము అనే అమృతమును, నిరంతర ఐశ్వర్య దాయకమైన ముక్తిని, సౌభాగ్యములను పొందెదరు.

కొన్ని వివరణలు:

(1) దేవతలు మందరగిరి పర్వతాన్ని కవ్వముగా చేసుకుని, వాసుకిని త్రాడుగా చేసుకుని పాల-సముద్రమును చిలికితే, అప్పుడు వారికి, చంద్రుడు, కామధేనువు, కల్పవృక్షము, చింతామణి, హాలాహలము, అమృతము ఇత్యాది వస్తువులు లభించాయి. అలానే, ధీమంతులు 'శ్రద్ధ కలిగిన మనస్సు'ను కవ్వముగా చేసుకుని, 'దృఢ భక్తి'ని త్రాడుగా చేసుకుని వేద-సముద్రమును చిలికితే ఏమి లభిస్తాయో ఈ శ్లోకములో శంకరాచార్యులవారు తెలియజేస్తున్నారు.

(2) శంకరాచార్యులవారు ఈ శ్లోకములో పదాలను చాలా గమ్మత్తుగా ప్రయోగించారు. ఉదాహరణకు, "సోమః" అన్న పదానికి "చంద్రుడు" అనే అర్ధముతోపాటు, "పార్వతీ సమేతుడైన పరమేశ్వరుడు" (స+ఉమః=సోమః) అని మరొక అర్ధముకూడా కలదు. పాల-సముద్రాన్ని చిలికినప్పుడు సోముడు లభిస్తే, వేద-సముద్రాన్ని చిలికినవారికి సాక్షాత్తు ఉమాసమేతుడైన పరమేశ్వరుడే లభించగలడు అని చెబుతున్నారు.

Sunday, 14 October 2012

Sivanandalahari-36

భక్తో భక్తిగుణావృతే ముదమృతాపూర్ణే ప్రసన్నే మనః
కుంభే సాంబ తవాంఘ్రిపల్లవయుగం సంస్థాప్య సంవిత్ ఫలమ్
సత్వం మన్త్రముదీరయన్నిజ శరీరాగార శుధ్దిం వహన్
పుణ్యాహం ప్రకటీ కరోమి రుచిరం కల్యాణమాపాదయన్ (36)

భక్తః = భక్తుడు
భక్తి గుణ ఆవృతే = భక్తి అనెడి సూత్రముచే (దారముచే) ఆవృతమై (కప్పబడి)
ముద అమృత ఆపూర్ణే  = సంతోషము అనెడి అమృత జలములతో నింపబడిన
ప్రసన్నే = నిర్మలమైన
మనః కుంభే = మనస్సు అనెడి కలశమునందు
సాంబ = ఓ సాంబశివా, జగన్మాతతో కూడియున్నవాడా
తవ అంఘ్రి పల్లవ యుగం = నీ పాదములు అనెడి (మామిడి) చిగుళ్ళను
సంస్థాప్య = ఉంచి
సంవిత్ ఫలమ్ = జ్ఞానము అనెడి ఫలమును (కొబ్బరికాయను)
సత్వం మన్త్రం = సత్వమును కలిగించెడు నీ మంత్రమను (ఓం నమః శివాయ)
ఉదీరయన్ = ఉచ్చరించుచు
నిజ శరీర ఆగార = నా శరీరము అనెడి గృహమును
శుధ్దిం వహన్ = శుద్ధి చేసుకొనుటకై
పుణ్యాహం = పుణ్యాహము
ప్రకటీ కరోమి = చేయుచున్నాను
రుచిరం కల్యాణం = విశేషమైన మంగళములను
ఆపాదయన్ = పొందగోరి

ఓ సాంబశివా, నీ భక్తుడనైన నేను విశేషమైన మంగళములను పొందగోరి, నా శరీరము అనెడి గృహమును శుద్ధి చేసుకొనుటకై, భక్తి అనెడి సూత్రముచే ఆవృతమై, సంతోషము అనెడి అమృత జలములతో నింపబడిన నిర్మలమైన నా మనస్సు అనెడి కలశమునందు, నీ పాదములు అనెడి మామిడి చిగుళ్ళను, మరియు జ్ఞానము అనెడి నారికేళ ఫలమును ఉంచి, సత్వమును కలిగించెడు 'ఓం నమః శివాయ' అను మంత్రమను ఉచ్చరించుచు పుణ్యాహము చేయుచున్నాను.

కొన్ని వివరణలు:

(1) వివాహము, గృహప్రవేశము మొదలగు శుభకార్యములు చేసుకునేటప్పుడు, లేదా అమంగళములవలన మైల పడినవాటిని శుద్ధి చేసుకునేందుకు "పుణ్యాహము" అనెడి వైదిక విధిని ఆచరిస్తారు. అందులో భాగంగా, పై చిత్రములో చూపిన విధముగా, ఒక కలశ చుట్టూ పసుపు వ్రాసిన దారమును చుట్టి, ఆ కలశలో నీరుపోసి, అందులో మామిడి చిగుళ్ళను పెట్టి, ఆ పైన ఒక కొబ్బరికాయను ఉంచుతారు. అయితే ఈ శ్లోకమునందు, మన శరీరము అనెడి గృహమును శుద్ధి చేసుకోవడంకోసం ఆచరించవలసిన పుణ్యాహమునకు కావలసిన సామగ్రిగూర్చి వివరిస్తున్నారు.

Saturday, 13 October 2012

Sivanandalahari-35

యోగక్షేమ ధురంధరస్య సకలః శ్రేయః ప్రదోద్యోగినో
దృష్టాదృష్ట మతోపదేశ కృతినో బాహ్యాన్తర వ్యాపినః
సర్వజ్ఞస్య దయాకరస్య భవతః కిం వేదితవ్యం మయా
శంభో త్వం పరమాన్తరంగ ఇతి మేచిత్తే స్మరామ్యన్వహమ్ (35)

యోగ క్షేమః = యోగ క్షేమములు
ధురంధరస్య = కేవల బాధ్యతగా కలిగియున్నవాడవు
సకల శ్రేయః = సకల శ్రేయస్సులను
ప్రదోద్యోగినః = ప్రదానము చేయుటయే ఉద్యోగముగా కలవాడవు
దృష్ట అదృష్ట మత = ఇహ పర సాధనలకు ఆవశ్యకమైన జ్ఞానమును
ఉపదేశ కృతినః = ఉపదేశించుటలో నిష్ణాతుడవు
బాహ్యాన్తర వ్యాపినః = బాహ్యాంతరములయందు వ్యాపించినవాడవు
సర్వజ్ఞస్య = సర్వజ్ఞుడవు
దయాకరస్య = దయాకరుడవు
భవతః = (అయిన) నీకు
కిం వేదితవ్యం = ఏమి విన్నవించుకోవలసి యున్నది?
మయా = నాచేత
శంభో = ఓ శంభో,
పరమ అన్తరంగ = (నీవు నాకు) అత్యంత ఆంతరంగికుడవు
ఇతి మే చిత్తే  = అని నా మనస్సులో
స్మరామి = స్మరించుకొనుచున్నాను
అన్వహమ్ = ప్రతి రోజు

ఓ ఈశ్వరా, మా యోగ క్షేమములను చూసుకోవడమే నీ కేవల బాధ్యతగా కలిగియున్నవాడవు, మాకు సకల శ్రేయస్సులను ప్రదానము చేయుటయే ఉద్యోగముగా కలవాడవు, ఇహ పర సాధనలకు ఆవశ్యకమైన జ్ఞానమును ఉపదేశించుటలో నిష్ణాతుడవు, మా బాహ్యాంతరములయందు వ్యాపించినవాడవు, సర్వజ్ఞుడవు, దయాకరుడవు అయిన నీకు నేను ఏమి విన్నవించుకోవలసి యున్నది? ఓ శంభో, నీవు నాకు అత్యంత ఆంతరంగికుడవన్న సత్యమును ప్రతి రోజు నా మనస్సులో స్మరించుకొనుచున్నాను.

Friday, 12 October 2012

Sivanandalahari-34

కిం బ్రూమస్తవ సాహసం పశుపతే కస్యాస్తి శంభో భవ
ధ్దైర్యం చేదృశమాత్మనః స్థితిరియం చాన్యైః కథం లభ్యతే
భ్రశ్యద్దేవగణం త్రసన్మునిగణం నశ్యత్ ప్రపంచం లయం
పశ్యన్నిర్భయ ఏక ఏవ విహరత్యానన్ద సాన్ద్రో భవాన్ (34)

కిం బ్రూమః = ఏమని చెప్పగలము?
తవ సాహసం = నీ సాహసమునుగూర్చి
పశుపతే = ఓ పశుపతీ
కస్య అస్తి = ఎవరికి ఉన్నది?
శంభో = ఓ శంభో, ఆనందప్రదాయకా
భవద్ ధైర్యం = నీ ధైర్యము
చ ఈదృశం = మరియు అట్టి
ఆత్మనః స్థితిః = ఆత్మ స్థితి
ఇయం చ = ఇది మరి
అన్యైః కథం లభ్యతే = తక్కినవారు ఎలా పొందగలరు?
భ్రశ్యద్ దేవ గణం = దేవ గణములు పారిపోయినవి
త్రసన్ ముని గణం = ముని గణములు వణికిపోయినవి
నశ్యత్ ప్రపంచం లయం = ప్రపంచం నశించి లయమైపోవడం
పశ్యన్ = చూచి
నిర్భయ ఏక ఏవ = నిర్భయముగా ఒక్కడివే
విహరతి = విహరిస్తూ ఉన్నావు
ఆనన్ద సాన్ద్రః = మహదానందములో
భవాన్ = నీవు

ఓ పశుపతీ, నీ సాహసమునుగూర్చి ఏమని చెప్పగలము? ఓ శంభో, నీ ధైర్యము మరియు అట్టి ఆత్మ స్థితి మరి తక్కినవారు ఎలా పొందగలరు? ప్రపంచమంతా ప్రళయమునందు నశించి లయమైపోవడం చూచి, దేవగణములు పారిపోయినవి, మునిగణములు వణికిపోయినవి. నీవుమాత్రం నిర్భయముగా ఒక్కడివే మహదానందములో విహరిస్తూ ఉన్నావు.

కొన్ని వివరణలు:

(1) కేవలము ఈశ్వరుని గొప్పతనాన్ని స్తుతి చేయడమే ఈ శ్లోకముయొక్క లక్ష్యము కాదు. ఇంతకు ముందు శంకరాచార్యులవారు (28వ శ్లోకములో) వివరించినట్లు, మనము ఎంతగా శివుని తత్వాన్నిగూర్చి చింతన చేస్తే, మనలోనూ అంతగా ఈశ్వరుని గుణములే వికసిస్తాయి. ఈ శ్లోకములో తెలిపినట్టి ఈశ్వరుని ఆత్మ స్థితిగూర్చి ధ్యానించుటద్వారా, మనముకూడా పరిస్థితులపైన ఆధారపడని అట్టి నిశ్చలమైన, భయరహితమైన స్థితిని ఈశ్వరానుగ్రహముతో కొంతవరకైనా పొందగలమని చెప్పడం శంకరాచార్యులవారి ఆంతర్యమేమో!

Thursday, 11 October 2012

Sivanandalahari-33

నాలం వా సకృదేవ దేవ భవతస్సేవా నతిర్వా నుతిః
పూజా వా స్మరణం కథాశ్రవణమప్యాలోకనం మాదృశామ్
స్వామిన్నస్థిర దేవతానుసరణాయాసేన కిం లభ్యతే
కా వా ముక్తిరితః కుతో భవతి చేత్ కిం ప్రార్థనీయం తదా (33)

న అలం వా = చాలదా?
సకృద్ ఏవ = కేవలము ఒక్కసారి
దేవ = ఓ దేవా
భవతః సేవా = నీ సేవ
నతిః వా నుతిః = సాష్టాంగ ప్రణామము మరియు స్తుతి
పూజా వా = ఆరాధనము మరియు
స్మరణం= స్మరణము
కథా శ్రవణం = కథా శ్రవణము
అపి ఆలోకనం = మరియు ఆలోకనము (= నిశితముగా చూచుట)
మాదృశామ్ = నాలాంటి వాడికి
స్వామిన్ = ఓ స్వామీ
అస్థిర దేవతా = అస్థిరమైన దేవతలను
అనుసరణ ఆయాసేన = అనుసరించుటచే కలుగు ఆయాసమువలన
కిం లభ్యతే = ఏమి లభించును?
కా వా ముక్తిః = ముక్తి అంటే ఏమిటి?
ఇతః కుతో భవతి చేత్ = అది ఇక్కడ కాకుంటే మరి ఇంకెక్కడ ఉన్నది?
కిం ప్రార్థనీయం తదా = అటువంటప్పుడు దేనిని గూర్చి ప్రార్ధించాలి?

ఓ దేవా, ఒక్కసారైనా నీ సేవ, నీకు సాష్టాంగ ప్రణామము మరియు స్తోత్రము చేయడము, నీ ఆరాధనము మరియు స్మరణము, నీ కథా శ్రవణము మరియు ఆలోకనములను చేసినా, నాలాంటి వాడికి చాలదా? ఓ స్వామీ, అస్థిరమైన దేవతలను అనుసరించుటచే కలుగు ఆయాసమువలన ఏమి ప్రయోజనము కలదు? ముక్తి అంటే ఏమిటి? అది ఇక్కడ కాకుంటే మరి ఇంకెక్కడ ఉన్నది? అటువంటప్పుడు ఇక దేనిని గూర్చి ప్రార్ధించాలి?

Wednesday, 10 October 2012

Sivanandalahari-32

జ్వాలోగ్రస్సకలామరాతి భయదః క్ష్వేలః కథం వా త్వయా
దృష్టః కించ కరే ధృతః కరతలే కిం పక్వ జమ్బూఫలమ్
జిహ్వాయాం నిహితశ్చ సిధ్దగుటికా వా కణ్ఠదేశే భృతః
కిం తే నీలమణిర్విభూషణమయం శంభో మహాత్మన్ వద (32)

జ్వాలోగ్రః = ఉగ్ర జ్వాలలతో
సకల అమర = దేవతలందరకీ
అతి భయదః క్ష్వేలః = తీవ్ర భయమును కలిగించిన గరళము
కథం వా = ఎలా
త్వయా దృష్టః = నీచే చూడబడినది?
కిం చ = అంతేగాక
కరే ధృతః = (ఎలా) చేతితో పట్టుకున్నావు?
కర తలే = అరచేతిలో (పెట్టుకోవడానికి)
కిం పక్వ జమ్బూ ఫలమ్ = అదేమైనా అరముగ్గిన నేరేడుపండా?
జిహ్వాయాం నిహితః చ = మరియు నాలుకపై ఉంచుకొనబడినది
సిధ్ద గుటికా వా = అదేమైనా వైద్యుడిచ్చిన ఔషధ గుళికా?
కణ్ఠ దేశే భృతః = కంఠమునందు నిలిపివేసావు
కిం తే = అదేమైనా నీ
నీల మణి విభూషణం = నీలమణి పొదిగిన కంఠాభరణమా?
అయం = దీనిని గురించి
శంభో = ఓ శంభో, ఆనంద ప్రదాయకా
మహాత్మన్ = ఓ మహాత్మా
వద = చెప్పుము

ఓ శంభో, ఓ మహాత్మా, నీవు ఈ సంగతి చెప్పవయ్యా. ఉగ్ర జ్వాలలతో దేవతలందరకీ తీవ్ర భయమును కలిగించిన ఆ గరళమును అసలు నీవు ఎలా చూడగలిగావు? చూడడమేగాక, దానిని చేతితో ఎలా పట్టుకున్నావు? అలా అరచేతిలో పెట్టుకోవడానికి అదేమైనా అరముగ్గిన నేరేడుపండా? నాలుకపై ఉంచుకోవడానికి అదేమైనా వైద్యుడిచ్చిన ఔషధ గుళికా? పైగా కంఠమునందు నిలిపివేయడానికి అదేమైనా నీలమణి పొదిగిన కంఠాభరణమా?

Tuesday, 9 October 2012

Sivanandalahari-31

నాలం వా పరమోపకారకమిదం త్వేకం పశూనాం పతే
పశ్యన్ కుక్షిగతాన్ చరాచరగణాన్ బాహ్యస్థితాన్ రక్షితుమ్
సర్వామృత్య పలాయనౌషధమతి జ్వాలాకరం భీకరం
నిక్షిప్తం గరలం గలే న గిలితం నోద్గీర్ణమేవ త్వయా (31)

న అలం వా = చాలదా?
పరమోపకారకం = మహోపకారం
ఇదం తు ఏకం = ఈ ఒక్కటే
పశూనాం పతే = ఓ పశుపతీ
పశ్యన్ = చూసి
కుక్షి గతాన్ = ఉదరములో ఉన్న
చర అచర గణాన్ = చరాచర గణములను
బాహ్యస్థితాన్ = (మరియు) బాహ్యమున ఉన్నవాటిని
రక్షితుం = రక్షించడం కోసమని
సర్వ అమృత్య = అమరులు (దేవతలు) అందరినీ
పలాయన ఔషధం = పరుగెత్తించిన ఔషధము
అతి జ్వాలాకరం = ఉగ్ర జ్వాలలు కలిగినది
భీకరం = భీకరమైనది అయిన
నిక్షిప్తం గరలం = గరళమును ఉంచి
గలే = గళమునందు
న గిలితం = మ్రింగకుండా
న ఉద్గీర్ణం ఏవ = క్రక్కకుండా
త్వయా = నీచేత

ఓ పశుపతీ, (నీ కారుణ్యముగూర్చి చెప్పడానికి) నీవు చేసిన ఈ మహోపకారం ఒక్కటే చాలదా? నీ ఉదరము లోపల మరియు బయట ఉన్న చరాచర గణములను చూసి, వాటిని రక్షించడం కోసమని, దేవతలందరినీ పరుగెత్తించిన ఔషధము, ఉగ్ర జ్వాలలు కలిగినది, భీకరమైనది అయినట్టి గరళమును లోపలకు మ్రింగక, బయటకు క్రక్కక, నీవు నీ గళమునందే ఉంచుకున్నావు.

కొన్ని వివరణలు:

(1) ఈశ్వరుని సచ్చరిత్రము అనెడి అమృత ప్రవాహమునందు "హాలాహల భక్షణము" ఒక ప్రధానమైన ఘట్టము. ఎందుచేతనంటే, జగత్పిత, జగత్పతి అయిన పరమేశ్వరునికి జీవకోటిపైగల అవ్యాజమైన అపార కారుణ్యమునకు నిలువుటద్దం పట్టే అపూర్వ సంఘటన ఇది. అందరినీ సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తే ఈ అద్భుత లీలనుగూర్చి, శ్రీ శంకరభగవత్పాదులవారు ఈ (31వ) శ్లోకములోనూ, మరియు రాబోయే (32వ) శ్లోకములోనూ తమదైన శైలిలో కీర్తించారు.

Monday, 8 October 2012

Sivanandalahari-30

వస్త్రోధ్దూతవిధౌ సహస్రకరతా పుష్పార్చనే విష్ణుతా
గన్ధే గన్ధవహాత్మతాஉన్నపచనే బర్హిర్ముఖాధ్యక్షతా
పాత్రే కాంచనగర్భతాస్తి మయి చేద్బాలేన్దు చూడామణే
శుశ్రూషాం కరవాణి తే పశుపతే స్వామిన్ త్రిలోకీ గురో (30)

వస్త్ర ఉధ్దూత విధౌ = వస్త్రయుగ్మం సమర్పించుటకు
సహస్ర కరతా = సహస్ర కరములు కలవాడు (సూర్యుడు)
పుష్పార్చనే  = పుష్పములతో అర్చించుటకు
విష్ణుతా = సర్వవ్యాపి అయిన విష్ణువును
గన్ధే గన్ధ వహాత్మతా = గంధము సమర్పించుటకు, వాసనలకు వాహకుడు (వాయువు)
అన్న పచనే = పచనముచేసిన అన్నమును సమర్పించుటకు
బర్హి ముఖ అధ్యక్షతా = అగ్నికి ప్రభువైనవాడు (ఇంద్రుడు)
పాత్రే కాఞ్చన గర్భతా = పూజించుటకై పాత్రలను సృజించుటకు, బ్రహ్మను
అస్తి మయి చేత్ = నేను అయి ఉంటే (మాత్రమే)
బాలేన్దు చూడామణే = ఓ బాలేన్దు శేఖరా
శుశ్రూషాం కరవాణి తే = నీ శుశ్రూష చేయగలను
పశుపతే = ఓ పశుపతీ
స్వామిన్ = ఓ స్వామీ
త్రిలోకీ గురో = ఓ త్రైలోక్యగురూ

బాలేన్దు శేఖరా, ఓ పశుపతీ, ఓ స్వామీ, ఓ త్రైలోక్యగురూ, నేను సహస్ర కరములు కలిగిన సూర్యుడను అయివుంటేనే నీకు వస్త్రయుగ్మమును, సర్వవ్యాపి అయిన విష్ణువును అయివుంటేనే పుష్పములను, వాయువును అయివుంటేనే గంధమును, అగ్నికి ప్రభువైన ఇంద్రుడను అయివుంటేనే పచనముచేసిన అన్నమును సమర్పించి, బ్రహ్మను అయివుంటేనే నిన్ను పూజించుటకై పాత్రలను సృజించి, అప్పుడు మాత్రమే నీ శుశ్రూష చేయగలను.

కొన్ని వివరణలు:

(1) "కరములు" అనగా "కిరణములు" అనికూడా అర్ధము ఉన్నది. సహస్ర (అసంఖ్యాక) కరములు గలవాడు సూర్య భగవానుడు.

(2) ఒకానొకప్పుడు శ్రీమహావిష్ణువు పరమశివుని సహస్ర కమలములతో అర్చింపదలచి, పూజ చేయుచున్నప్పుడు, పూజ చివరిలో ఒక కమలము తక్కువైనది. కమలాక్షుడగు శ్రీహరి, పూజకు ఆటంకము కలుగకుండా, భక్తి పరవశత్వముతో, తన కంటినే కమలమునకు బదులుగా పరమేశ్వరునికి సమర్పించుటకు ఉద్యుక్తుడవుతాడు. వెంటనే పరమశివుడు ప్రత్యక్షమై, విష్ణువును వారించి, అమితానందముతో ఆలింగనము చేసుకుని, విష్ణువునకు సుదర్శన చక్రమును అనుగ్రహిస్తాడు.

(3) ఈ శ్లోకమునందు శంకరాచార్యులవారు పరమశివుని విరాట్ స్వరూపమునుగూర్చి ప్రత్యక్షముగా చెప్పకనే, కన్నులకు కట్టినట్లు చూపిస్తారు!