Saturday, 11 August 2012

Sivanandalahari-3

 త్రయీవేద్యం హృద్యం త్రిపురహరమాద్యం త్రినయనం
జటాభారోదారం చలదురగహారం మృగధరమ్ .
మహాదేవం దేవం మయి సదయభావం పశుపతిం
చిదాలమ్బం సామ్బం శివమతివిడమ్బం హృది భజే (3)

త్రయీవేద్యం = మూడు వేదములద్వారా  తెలుసుకొనబడువాడు
హృద్యం = హృదయమునకు ప్రియమైనవాడు
త్రిపురహరం = త్రిపురాంతకుడు
ఆద్యం = ఆద్యుడు
త్రినయనం = త్రినేత్రుడు
జటాభారోదారం = విస్తారమైన జటలు కలిగినవాడు
చలదురగహారం = చలించే పామును హారముగా అలంకరించుకున్నవాడు
మృగధరం = లేడిని చేబూనినవాడు
మహాదేవం = దేవాధిదేవుడు
దేవం = స్వయం ప్రకాశకుడు
మయి సదయభావం = నాయందు దయగలవాడు
పశుపతిం = సర్వజీవులకు ప్రభువైనవాడు
చిదాలమ్బం = జ్ఞానమునకు ఆధారమైనవాడు
సామ్బం = (ఎల్లప్పుడూ) అంబికతో కలిసియుండువాడు
శివం = సర్వ మంగళ ప్రదాత
అతివిడమ్బం = నటనలో (లేదా అనుకరించుటలో) అత్యద్భుతమైన ప్రజ్ఞ కలవాడు
హృది భజే = (అయినట్టి ఆ పరమేశ్వరుని) నా హృదయమునందు ధ్యానించుచున్నాను

మూడు వేదములద్వారా  తెలుసుకొనబడువాడు, హృదయమునకు ప్రియమైనవాడు, త్రిపురాంతకుడు, ఆద్యుడు, త్రినేత్రుడు, విస్తారమైన జటలు కలిగినవాడు, కదులుతూ ఉండే పామును హారముగా అలంకరించుకున్నవాడు, లేడిని చేబూనినవాడు, దేవాధిదేవుడు, స్వయం ప్రకాశకుడు, నాయందు దయగలవాడు, సర్వజీవులకు ప్రభువైనవాడు, జ్ఞానమునకు ఆధారమైనవాడు, ఎల్లప్పుడూ అంబికతో కలిసియుండువాడు, సర్వ మంగళ ప్రదాత, అనుకరించుటలో అత్యద్భుతమైన ప్రజ్ఞ కలవాడు అయినట్టి ఆ పరమేశ్వరుని నా హృదయమునందు ధ్యానించుచున్నాను.

కొన్ని వివరణలు:

(1) "త్రయీవేద్యం" అనే పదమునకు - "ప్రణవోపాసనమనెడి త్రయీవిద్యద్వారా తెలుసుకొనబడువాడు"అనే అర్ధముకుడా కలదు.

(2) "త్రిపురహరం" అనగా - జాగ్రత్, స్వప్న, సుషుప్తి అనెడి మూడు స్థితులను దాటించి తురీయ స్థితిని ప్రసాదించువాడు అని,  / లేదా సత్వ, రజో తమస్సు అనెడి త్రిగుణములను హరించి, సుద్ధసత్వస్థితిని ప్రసాదించువాడు అనికుడా అర్ధము కలదు.

త్రిపురములనగా స్థూల, సూక్ష్మ, కారణ శరీరములని అర్ధము. శివుడు మూడుసార్లు త్రిపురాసుర సంహారము గావించినట్లు చెప్పెదరు. మొదట శివానుగ్రహమువలన శారీరక రోగములు నశించి దేహశుద్ధి కావలయును. పిమ్మట కామక్రోధాదులు నశించి మానసశుద్ధి యగుట సూచింపబడినది. మూడవసారి కారణ శరీరమును ఆవరించిన తమస్సు నాశనము చేయబడుట వర్ణించబడినది. ఇదియే త్రిపురాసుర సంహార రహస్యము. (మూలము: బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణశాస్త్రి గారు ఉపన్యాసముల సంకలనము: "నాకు తోచిన మాట" గ్రంధములోని 6వ ఉపన్యాసములో ఇవ్వబడ్డ వివరణము.)

(3) "పశువు" అనగా "పాశములచే బంధింపబడినది" అనిట అర్ధము. కామము, క్రోధము మొదలైన అరిషడ్వర్గములను పాశములచే బంధింపబడి వుండుటచే, మనముకూడా పశువులుగానే పరిగణింపబడతాము అన్నదాంట్లో ఏమాత్రమూ సందేహములేదు! అట్టి సర్వ జీవులకు పరమేశ్వరుడు ప్రభువు కావడముచేత ఆయనను "పశుపతి" అని పిలుస్తారు.

(4) పై శ్లోకములో వర్ణించబడిన పరమశివుని రూపము మరియు ఆయన ధరించిన అలంకారములు తాత్వికమైన సంకేతాలు. ఉదాహరణకు: శివుని మూడవకన్ను జ్ఞాననేత్రము; అది తెరువబడినప్పుడు నానాత్వముతోకూడియున్న ఈ జగత్తు నశించి, దాని స్థానములో ఒక్కటే అయిన పరబ్రహ్మము దర్శనమిస్తుంది. అలానే, శివుడు ఒక చేతిలో లేడిని ధరించి ఉంటాడు; లేడి మన మనస్సునకు గల చంచలత్వమును చూచిస్తుంది (లేడి ఎప్పుడూ ఒకచోట స్థిరంగా ఉండక, అటూ ఇటూ గెంతుతూ ఉంటుంది, మన మనస్సులాగానే!); అలానే లేడిని మాయకు చిహ్నంగాకూడా చెబుతారు; తనను ధ్యానించినవారికి అలా మనస్సునకు గల చంచలత్వము/మాయ తొలగుతుంది అని చెప్పడానికి సంకేతంగా ఆయన చేతిలో లేడిని ధరించి ఉంటాడు. పై శ్లోకములో వర్ణించబడిన శివునియొక్క రూపాన్ని, ధరించిన ఆభరణాలనుగూర్చి శ్రధ్ధతో ధ్యానిస్తే వాటియొక్క నిజతత్వము మన మనస్సుకే జ్యోతకమవుతుందని పెద్దలు చెబుతారు.

No comments:

Post a Comment